వదంతులకు తెర.. ప్రజల ముందుకు కిమ్.. సాక్ష్యం ఇదిగో!

అధ్యక్షుడు కిమ్ జోంగ్‌ ఉన్‌ ఆరోగ్యంపై గత 20 రోజులుగా వస్తున్న వదంతులకు తెరపడినట్లయింది. ఏప్రిల్‌ 11 నుంచి కిమ్ ఆచూకీ లేకపోవడంతో ఆయన ఆరోగ్యంపై పలు ఊహాగానాలు వెలువడిన విషయం తెలిసిందే. తీవ్రమైన గుండెపోటు రావడంతో ఆయనకు శస్త్రచికిత్స నిర్వహించారని, కోమాలోకి వెళ్లిపోయినందువల్లే ఏప్రిల్‌ 15న తన తాత కిమ్ ఇల్ సంగ్ 108 జయంతి వేడుకలకు గైర్హాజరయ్యారంటూ అంతర్జాతీయ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఈ ఊహాగానాలకు తెరదించుతూ ఉత్తర కొరియా అధికారిక మీడియా కీలక ప్రకటన చేసింది. తమ అధినేత కిమ్‌ జోంగ్ ఉన్ ప్రజల ముందుకు వచ్చినట్లు ఆ దేశ అధికారిక మీడియా కేసీఎన్‌ఏ వెల్లడించింది.

రాజధాని ప్యాంగ్‌యాంగ్ సమీపంలోని సన్‌చిన్‌లో ఓ ఎరువుల కంపెనీ నిర్మాణం పూర్తయిన సందర్భంగా జరిగిన కార్యక్రమానికి కిమ్‌ హాజరయ్యారని తెలిపింది. ఈ వేడుకలకు కిమ్‌ సోదరి కిమ్‌ యో జోంగ్‌ సహా పలువురు కీలక అధికారులు కూడా హాజరైనట్లు పేర్కొంది. కిమ్‌ కనిపించగానే ఒక్కసారిగా అక్కడి వారంతా సంభ్రమాశ్చర్యానికి గురయ్యారని కేసీఎన్‌ఏ పేర్కోవడం గమనార్హం. అయితే, ఈ కార్యక్రమంలో కిమ్ పాల్గొన్నారనడానికి ఆధారాలను ప్రచురించింది. ఆయన హాజరయినట్టు చెబుతున్న ఓ ఫోటోను కూడా విడుదల చేయలేదు. కిమ్‌ ఆరోగ్య పరిస్థితి ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. అయితే కిమ్‌ జనాల మధ్యకు వచ్చారన్నదానిపై ఇప్పటి వరకు అంతర్జాతీయ మీడియా మాత్రం స్పందించలేదు.

కిమ్ జోంగ్ ఉన్న చివరిసారిగా ఏప్రిల్ 11న దేశంలో కరోనా వైరస్ కట్టడికి తీసుకుంటున్న సమీక్షకు హాజరైనట్టు అధికారి మీడియా ప్రకటించింది. అప్పటి నుంచి కిమ్‌ ఆరోగ్యంపై భిన్న కథనాలు వెలువడటంతో చైనా ఒక వైద్య బృందాన్ని ఉత్తర కొరియాకు పంపింది. మరోవైపు తాజా పరిస్థితులను అమెరికా నిశితంగా పరిశీలిస్తోందని ఆ దేశం అధికారులు తెలిపారు. కిమ్‌ ఆరోగ్యంపై వస్తున్న వార్తాలను అమెరికా అధినేత డొనాల్డ్ ట్రంప్ సైతం కొట్టిపారేశారు. ఆయన గురించి నిర్దిష్ట నిఘా సమాచారమేదీ లేదని అమెరికా నిఘా వర్గాలు వివరించాయి. దక్షిణ కొరియా సైతం ఆయన ఆరోగ్యంగా ఉన్నట్టు తెలిపింది.

కిమ్ ఆరోగ్యంపై ప్రచారం జోరుగా సాగుతున్న వేళ ఐక్యరాజ్య సమితి ‘సైతం స్పందించింది. కిమ్‌ ఆరోగ్య పరిస్థితిపై తమకు ఎలాంటి సమాచారం లేదని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ స్పష్టం చేశారు. ఈ విషయంపై తమ ప్రతినిధులెవరూ ఉత్తరకొరియా ప్రభుత్వంతోగానీ, ఆ దేశ ప్రతినిధులతోగానీ మాట్లాడలేదని వ్యాఖ్యానించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here