లాక్ డౌన్ వేళ రోడ్డుపై బైఠాయించిన బీజేపీ ఎంపీ

దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలవుతోంది. రాష్ట్రాన్నీ కరోనా కట్టడికి పటిష్టంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. అయితే అలాంటి పరిస్థితుల్లో ఓ ఎంపీ వినూత్నంగా నిరసనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి పోలీసులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేప్టటారు. పశ్చిమ బెంగాల్‌ బీజేపీకి చెందిన ఓ ఎంపీ రోడ్డుపై బైఠాయించారు. బెంగాల్‌లోని దక్షిణ దీనాజ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న సుకుంటా మజుందార్‌ను లాక్‌డౌన్‌ కారణంగా పోలీసులు ఆయన సొంత నియోజకవర్గంలోకి అనుమతించడంలేదు. గత ఇరవై రోజులుగా దీనాజ్‌పూర్‌లోకి ప్రవేశించేందుకు ఎంపీ ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ పోలీసులు మాత్రం ఆయనను అడ్డుకుంటున్నారు.

దీంతో పోలీసుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన ఎంపీ.. రోడ్డుపై బైఠాయించారు. తనపై కుట్రపూరితంగా వ్యవహరిస్తూ సొంత నియోజకవర్గంలోకి అనుమతించడంలేదని నడిరోడ్డుపై ధర్నాకు దిగారు. తనను గెలిపించిన పేదలకు కరోనా కష్టకాలంలోసేవచేయాలని భావిస్తున్నానన్నారు. కానీ ప్రభుత్వం దాన్ని అడ్డుకుంటుందంటూ ఎంపీ ఆరోపించారు. మరోవైపు రాష్ట్రంలో బీజేపీ నేతలపై తృణమూల్‌ కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఆ రాష్ట్ర బీజేపీ శాఖ సైతం ఆరోపిస్తోంది.

దీనిపై అధికార తృణమూల్‌ పార్టీ నేతలు స్పందించారు. బీజేపీ నేతలు లాక్‌డౌన్‌ ఉల్లంఘిస్తూ పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని ఆరోపించారు. అలాంటి వాటికి ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేవన్నారు. అందుకే బీజేపీ నేతల్ని అనుమతించడంలేదని అధికార పార్టీ నేతలు వివరించారు. అటు పోలీసులు కూడా ఎంపీ విమర్శలపై వివరణ ఇచ్చారు. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ కొనసాగుతున్నందున ఎవరినీ అనుమతించడంలేదన్నారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగానే తాము విధులను నిర్వర్తిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here