లాక్‌డౌన్ నుంచి మరిన్ని సేవలకు మినహాయింపు.. కేంద్రం కీలక నిర్ణయం

ఏప్రిల్ 20న నుంచి కొన్ని రంగాలకు మినహాయింపు ఇచ్చిన కేంద్రం.. హాట్‌స్పాట్ కాని ప్రాంతాల్లో తాజాగా మరికొన్ని సడలింపులు ఇచ్చింది. లాక్‌డౌన్ విధించి నెల రోజులు అవుతుండటం, వేసవి కావడంతో.. ఈ సడలింపులను తీసుకొచ్చింది. పట్టణ ప్రాంతాల్లో ఎలక్ట్రిక్‌ ఫ్యాన్లు విక్రయించే షాపులు, బుక్ షాపులకు మినహాయింపు ఇస్తున్నట్లు కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి సలీల శ్రీవాస్తవ తెలిపారు. మిల్క్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు, మొబైల్‌ రీఛార్జీ షాప్‌లు, బ్రెడ్ ఫ్యాక్టరీలు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు, పిండి మిల్లులకు లాక్‌డౌన్ నుంచి సడలింపు ఇస్తున్నట్లు కేంద్రం తెలిపింది.

రోడ్డు నిర్మాణ పనులు, సిమెంట్‌ పరిశ్రమలకు మినహాయింపు ఇస్తున్నట్లు కేంద్రం తెలిపింది. భౌతిక దూరాన్ని కచ్చితంగా పాటించాలని.. మాస్క్ తప్పనిసరిగా ధరించాలని కేంద్రం షరతు విధించింది. గత 28 రోజులు లేదా అంత కంటే ఎక్కువ రోజుల్లో 12 జిల్లాల్లో కొత్త కేసులు నమోదు కాలేదని తెలిపింది.

మార్చి 24న జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ.. కరోనా కట్టడి కోసం ఏప్రిల్ 14 వరకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అనంతరం దాన్ని మే 3 వరకు పొడిగించారు. కాగా తెలంగాణలో మే 7 వరకు లాక్‌డౌన్ పొడిగించిన కేసీఆర్ సర్కారు.. వ్యవసాయ కార్యకలాపాలకు మినహా మిగతా రంగాలకు ఎలాంటి సడలింపులు ఇవ్వలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here