భారత్ నుంచి అక్రమంగా పాక్‌లోకి ఔషధాలు.. విచారణకు ఆదేశించిన ఇమ్రాన్

భారత్‌ నుంచి 450 రకాల ఔషధాలు అక్రమంగా దిగుమతి అయినట్టు వచ్చిన ఆరోపణలపై ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ విచారణకు ఆదేశించారు. విటమిన్ తరహా ప్రాణధార ఔషధాలను అక్రమంగా భారత్ నుంచి దిగుమతి చేసుకుంటున్నట్టు పాక్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కాగా, జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ని కేంద్రం గతేడాది ఆగస్టు 5న రద్దుచేసిన తర్వాత.. భారత్‌తో అన్ని వాణిజ్య సంబంధాలను పాకిస్థాన్ రద్దుచేసుకుంది. అయితే, కరోనా కారణంగా ప్రాణాధార ఔషధాలకు తీవ్ర కొరత ఏర్పడటంతో… భారత్ నుంచి కొన్నింటిని దిగుమతి చేసుకోడానికి పాక్ ప్రభుత్వం అనుమతించింది.

వాటితో పాటు ఔషధాల తయారీకి అవసరమైన ముడిసరకును కూడా దిగుమతికి చేసుకునే అవకాశం కల్పించింది. ఈ సడలింపును అవకాశం తీసుకుని భారత్‌ నుంచి విటమిన్‌ మాత్రలు లాంటి 450కిపైగా ఔషధాలు దిగుమతి అవుతున్నాయంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. దీనిపై విపక్షాలు విమర్శలు గుప్పించడంతో పాక్ ప్రధాని ఇమ్రాన్‌ దర్యాప్తునకు ఆదేశించారు. అక్రమ దిగుమతులకు సంబంధించిన విచారణ బాధ్యతలను తన సహచరుడు షాజాద్ అక్బర్‌కు అప్పగించారు.

భారత్ నుంచి అనేక విటమిన్లు, ఔషధాలు, లవణాలు దిగుమతి చేసుకున్నట్లు నేషనల్ హెల్త్ సర్వీసెస్‌ పేర్కొన్నట్టు తెలియజేసే నివేదికను డాన్ పత్రిక ప్రచురించింది. ఈ నివేదికను మే 5న క్యాబినెట్ ముందు ఉంచినట్టు పేర్కొంది. ఎన్‌హెచ్ఎస్ కార్యదర్శి తన్వీర్ అహ్మద్ ఖురేషీ సంతకంతో కూడిన లేఖలో బీసీజీ, పోలియో, యాంటీ టిటానిస్ వ్యాక్సిన్ సహా చాలా ఔషధాలు, విటమిన్లు దిగుమతి చేసుకున్నట్టు పేర్కొన్నారు.

కాగా, విదేశాల నుంచి తిరిగివచ్చే పాకిస్థానీయుల క్వారంటైన్‌ సమయాన్ని ప్రభుత్వం 48 గంటలకు కుదించింది. పరీక్షల్లో వారికి కరోనా లేదని తేలితే, ఆ సమయం తర్వాత వారిని ఇళ్లకు పంపేస్తారు. లేదంటే ఐసోలేషన్‌ కేంద్రాలకు తరలిస్తారు. పాక్‌లో కొత్తగా 1,662కిపైగా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 34,336కు చేరింది. ఇప్పటివరకూ ఇక్కడ 737 మంది కరోనా కారణంగా మృతిచెందారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here