ప్రపంచవ్యాప్తంగా 34 లక్షలు దాటిన కేసులు.. ఒక్క అమెరికాలోనే 11.30 లక్షలు

ప్రపంచవ్యాప్తంగా ఉద్ధృతి కొనసాగుతోంది. ఇప్పటి వరకూ మొత్తం 34 లక్షల మందికిపైగా వైరస్ బారినపడ్డారు. వీరిలో దాదాపు 2.40 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, సుమారు 11 లక్షల మంది కోలుకోవడం ఊరట కలిగించే అంశం. మరో 20 లక్షల మందిలో వైరస్ లక్షణాలు ఉన్నాయి. వీరిలో 51 వేల మంది పరిస్థితి విషమంగా ఉంది. ఇక, అమెరికాలో 24 గంటల వ్యవధిలో 2,053 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో అక్కడ మొత్తం మృతుల సంఖ్య 65 వేలు దాటింది. మరోవైపు, దేశంలో వైరస్‌ బాధితుల సంఖ్య 11.31 లక్షలకు చేరింది.

అమెరికాలో రెండో అతిపెద్ద రాష్ట్రమైన టెక్సాస్‌లో వైరస్‌ ఉద్ధృతి పెరగడం ఆందోళన కలిగిస్తోంది. అక్కడ గురువారం ఒక్కరోజే దాదాపు 50 మంది మరణించారు. 1,033 కొత్త కేసులు నమోదయ్యాయి. అయినప్పటికీ, రాష్ట్రంలో ఆంక్షలను పాక్షికంగా సడలించారు. న్యూయార్క్‌ నగరంలో ఓ మతపెద్ద మృతిచెందడంతో అంత్యక్రియలకు గురువారం జనం భారీఎత్తున హాజరయ్యారు. భౌతిక దూరం పాటించకపోవడంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

కరోనా వైరస్ తగ్గుముఖం పట్టడంతో చైనా రాజధాని బీజింగ్‌లో శుక్రవారం పార్కులు, పురావస్తు ప్రదర్శనశాలలు తెరుచుకున్నాయి. అయితే- కొన్నాళ్లపాటు 30 శాతం మందినే అనుమతించనున్నట్లు అధికారులు ప్రకటించారు. 45 రోజులుగా అమల్లో ఉన్న కఠిన ఆంక్షలను దక్షిణాఫ్రికా పాక్షికంగా సడలించింది. మూడో వంతు సిబ్బందితో మాల్‌లు, కర్మాగారాలు తమ కార్యకలాపాలను పునఃప్రారంభించవచ్చునని పేర్కొంది.

రష్యాలో కరోనా ఉద్ధృతి పెరుగుతోంది. శుక్రవారం ఒక్కరోజే దాదాపు 8 వేల మంది పాజిటివ్‌గా తేలారు. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 1.14 లక్షలు దాటింది. ప్రపంచంలో మరో అతిపెద్ద హాట్‌స్పాట్‌గా బ్రెజిల్ మారుతోంది. ఇప్పటి వరకు అక్కడ 93వేల మంది వైరస్ బారినపడగా.. మొత్తం 6,412 మంది మృతిచెందారు.

బ్రిటన్‌లో కోవిడ్‌-19 బారిన పడి శుక్రవారం మరో 650 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో అక్కడ కరోనా మరణాలు 27,510కి చేరింది. శుక్రవారం ఇటలీలో 293 మంది, స్పెయిన్‌లో 310, ఫ్రాన్స్‌లో 300 మంది చనిపోయారు. ఇప్పటి వరకు ఇటలీలో 28,236 మంది, స్పెయిన్‌లో 24,824, ఫ్రాన్స్‌లో 24,594, బెల్జియంలో 7,700, జర్మనీలో 6,736 మంది కరోనా కాటుకు బలయ్యారు. ఈ దేశాల్లో బాధితుల సంఖ్య కూడా లక్షల్లోనే ఉంది. స్పెయిన్‌లో 242,988, ఇటలీలో 207,428, ఫ్రాన్స్‌లో 167,346, జర్మనీలో 164,077, బ్రిటన్ 177,454, టర్కీలో 122,392, బెల్జియం 49,032 మంది వైరస్ బారినపడ్డారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here