ప్రపంచవ్యాప్తంగా 32 లక్షలు దాటిన కోవిడ్ బాధితులు.. అదొక్కటే సానుకూలం!

ప్రపంచవ్యాప్తంగా తీవ్రత కొనసాగుతోంది. ఈ మహమ్మారి కోరల్లో చిక్కుకుని అన్ని దేశాలూ విలవిలలాడుతున్నాయి. అగ్రరాజ్యం అమెరికాలో వైరస్ విజృంభణ ఆగడం లేదు. మహమ్మారి కారణంగా మృతిచెందిన వారి సంఖ్య 61 వేలు దాటింది. రెండు దశాబ్దాలపాటు సాగిన వియత్నాం యుద్ధంలో 58,200 మంది అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోగా.. అంతకంటే ఎక్కువ మంది అమెరికన్లను ప్రస్తుతం కరోనా అతి తక్కువ కాలంలో చనిపోవడం గమనార్హం. మొత్తం కరోనా వైరస్‌ బాధితుల సంఖ్య 10.64 లక్షలు దాటింది. ప్రపంచవ్యాప్త కేసుల్లో సుమారు మూడో వంతు అక్కడే ఉన్నాయి.

ప్రపంచవ్యాప్తంగా మొత్తం 32 లక్షల మంది వైరస్ బారినపడగా.. వీరిలో 2.28 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, 10 లక్షల మంది కోలుకున్నారు. మరో 20 లక్షల మంది వైరస్‌తో పోరాడుతున్నారు. బ్రిటన్‌లో కరోనా దెబ్బకు మృతిచెందినవారి సంఖ్య ఒక్కసారిగా 26 వేలు దాటింది. ఒక్కరోజులోనే 3,800కుపైగా మరణాలను కరోనా బాధిత జాబితాలో యూకే ప్రభుత్వం చేర్చడం గమనార్హం. వాస్తవానికి అక్కడ గడచిన 24 గంటల్లో 765 మరణాలే చోటుచేసుకున్నాయి. అయితే దేశవ్యాప్తంగా సంరక్షణ కేంద్రాలు, ఆస్పత్రుల్లో కరోనాతో చాలా మంది చనిపోయినా లెక్కల్లోకి రాలేదని గుర్తించిన ప్రభుత్వం.. తాజాగా వాటిని అధికారిక లెక్కల్లో చేర్చింది.

ఐరోపాలోని ఇటలీలో 27,682, స్పెయిన్‌లో 24,275, ఫ్రాన్స్‌లో 24,087, బెల్జియంలో 7,501, జర్మనీలో 6,467 మంది కరోనా కాటుకు బలయ్యారు. ఈ దేశాల్లో బాధితుల సంఖ్య కూడా లక్షల్లోనే ఉంది. స్పెయిన్‌లో 236,899, ఇటలీలో 203,591, ఫ్రాన్స్‌లో 166,420, బ్రిటన్ 165, 539, జర్మనీలో 161,539, టర్కీలో 117,589, బెల్జియం 47,859 మంది వైరస్ బారినపడ్డారు. ఇరాన్‌లో కరోనా బాధితుల సంఖ్య 93వేలు దాటగా.. 5,957 మంది చనిపోయారు.

దక్షిణ అమెరికా దేశం బ్రెజిల్‌లో కోవిడ్ కేసులు 80వేలకు చేరవవుతున్నాయి. మొత్తంం 5,513 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఈ సంఖ్య ఎక్కువగానే ఉంటుందని, పలు హాస్పిటల్స్‌లో చనిపోయినవారిని అధికారిక లెక్కల్లో చేర్చలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రపంచ దేశాలన్నీ లాక్‌డౌన్, నిషేధాలు కొనసాగిస్తుంటే.. స్వీడన్‌ మాత్రం లాక్‌డౌన్‌ విధించకుండా ఆశ్చర్యపరుస్తోంది. వైరస్‌ ఆనవాళ్లు కనిపించిన ఆరంభం నుంచే ప్రజల్ని చైతన్యపరిచి.. కట్టడి చేయాల్సిన బాధ్యతను వారికి సైతం అప్పగించింది. కఠిన నిర్బంధాలేవీ విధించలేదు. ప్రజారవాణా నిరాటంకంగా నడుస్తోంది. యువత అధికంగా ఉండే కళాశాలలను మూసేయగా… చిన్నపిల్లలు పాఠశాలలకు వెళ్తున్నారు. ప్రభుత్వ ప్రమేయం లేని ప్రజారోగ్య సంస్థ స్వతంత్రంగా, చురుగ్గా పనిచేస్తోంది. ప్రజలే స్వచ్ఛంద నిర్బంధాన్ని పాటిస్తున్నారు.

ఈ విధానం ప్రమాదకరమని హెచ్చరికలు వస్తున్నా.. మా వ్యూహాలు మాకున్నాయని ధీమాగా చెబుతోంది. స్వీడన్‌లో మొత్తం కరోనా కేసులు 20వేలు దాటగా… ఇప్పటికే 2,462 మంది ప్రాణాలు కోల్పోయారు. రష్యాలోనూ కోవిడ్ కేసులు లక్షకు సమీపిస్తున్నాయి. కేవలం 972 మంది మాత్రమే ప్రాణాలు కోల్పోయారు. బెల్జియంలో మాత్రం మరణాలు భారీగా చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటి వరకూ 7,500 మంది ప్రాణాలు కోల్పోయారు. నెదర్లాండ్ 4,711, టర్కీ 3,082, జర్మనీ 6,467, కెనడా 2,996, స్విట్జర్లాండ్ 1,716, మెక్సీ 1,732, ఐర్లాండ్ 1,190 మంది చనిపోయారు.

ఢిల్లీలో తబ్లీగీ జమాత్‌ కార్యక్రమానికి తమ దేశం నుంచి హాజరైనవారిలో ముగ్గురికి తాజాగా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు నేపాల్‌ బుధవారం వెల్లడించింది. దీంతో ఆ దేశంలో వైరస్‌ బాధితుల సంఖ్య 57కు పెరిగింది. పాకిస్థాన్‌లో కరోనా బాధితుల సంఖ్య 15,289కి, మృతుల సంఖ్య 335కు పెరిగింది. శ్రీలంకలో కొత్తగా 12 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్య 611కు చేరుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here