నాందేడ్ నుంచి వచ్చిన 91 మందికి పాజిటివ్.. మహారాష్ట్రపై పంజాబ్ విమర్శలు

లాక్‌డౌన్ కారణంగా పలు రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కార్మికులు, విద్యార్థులు, యాత్రికులను స్వస్థలాలకు తరలించేందుకు కేంద్రం అనుమతించి, ప్రత్యేక రైళ్లు నడుపుతోన్న విషయం తెలిసిందే. అయితే, ఈ తరలింపుల్లో కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. మహారాష్ట్రలోని నాందేడ్‌ తఖ్త్ హజూర్ సాహిబ్ గురుద్వారా సందర్శనకు వచ్చిన 3,500 మంది పంజాబ్ యాత్రికులు చిక్కుకోగా.. వారిని ప్రత్యేక బస్సుల్లో ఆ రాష్ట్ర ప్రభుత్వం తరలించింది. ఇలా స్వరాష్ట్రానికి చేరుకున్న వారిలో 91 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ కావడంతో గురుద్వారాను మహారాష్ట్ర ప్రభుత్వం మూసివేసింది.

అంతేకాదు, గురుద్వారా చుట్టుపక్కల ప్రాంతాలవారిని క్వారంటైన్‌లో ఉంచి, పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ ఫలితాలు శనివారం సాయంత్రంలోగా రానున్నాయి. పంజాబ్‌లో శుక్రవారం కొత్తగా 218 మందికి వైరస్ నిర్ధారణ అయ్యింది. వీరిలో 91 మంది నాందేడ్ నుంచి వచ్చినవారే ఉన్నారు. దీంతో అక్కడ పాజిటివ్ కేసులు 585కి చేరాయి. హర్యానాలోననూ 18 మంది నాందేడ్ భక్తులు క్వారంటైన్‌లో ఉన్నట్టు అధికారులు తెలిపారు. లాక్‌డౌన్ కారణంగా పంజాబ్‌కు చెందిన దాదాపు 4 వేల మంది భక్తులు నాందేడ్‌లోని హజూర్ సాహిబ్ గురుద్వారా‌లో దాదాపు నెల రోజులుగా చిక్కుకుపోయారు.

మరోవైపు, మహారాష్ట్రపై పంజాబ్ ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. యాత్రికులకు పరీక్షలు నిర్వహించకుండా కేవలం స్క్రీనింగ్ నిర్వహించి ప్రయాణానికి అనుమతించిందని మండిపడింది. ఈ మేరకు మహారాష్ట్ర ప్రభుత్వానికి పంజాబ్ ఆరోగ్య శాఖ మంత్రి బల్బీర్ సింగ్ సింధు లేఖ రాశారు. గత 40 రోజులుగా తమ రాష్ట్ర పౌరులకు పరీక్షలు నిర్వహించడంలో మహారాష్ట్ర ఆరోగ్య శాఖ యంత్రాంగం అలసత్వం ప్రదర్శించిందన్నారు. గురుద్వారాలో చిక్కుకున్నవారికి పరీక్షలు నిర్వహించడానికి వైద్య సిబ్బందిని పంపమని చెబితే పంపేవారమని అన్నారు. పంజాబ్‌లో ఉంటున్న ప్రతి ఒక్కరికీ రాష్ట్రాలతో సంబంధం లేకుండా తాము పరీక్షలు నిర్వహిస్తున్నామని మంత్రి బల్బీర్ పేర్కొన్నారు.

పంజాబ్ విమర్శలపై మహారాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. బయలుదేరడానికి ముందు ప్రతి ఒక్క యాత్రికుడికి వైద్య పరీక్షలు నిర్వహించామని, వారిలో లక్షణాలు బయటపడలేదని సమాధానం ఇచ్చింది. పంజాబ్ చేరుకున్న తర్వాత వీరందరికీ పాజిటివ్ వచ్చిందని, మార్గమధ్యంలోనే వైరస్ బారినపడి ఉంటారని వ్యాఖ్యానించింది. అంతేకాదు, మధ్యప్రదేశ్‌లోని హాట్‌స్పాట్‌ల గుండా ముఖ్యంగా ఇండోర్, ఖర్‌గోవ్ నుంచి వీరి బస్సులు ప్రయాణించాయని మహారాష్ట్ర అధికారులు కౌంటర్ ఇచ్చారు.

ఇదిలా ఉండగా సందర్శకులందరికీ ఆహారాన్ని అందించే అదే ప్రాంగణంలోని గురుద్వారా లంగర్ సాహిబ్‌ను కూడా మూసివేసినట్టు అధికారులు తెలిపారు. లంగర్ సేవను నిలిపివేయాలని ఆదేశించినట్టు గురుద్వారా సూపరింటెండెంట్ గురువిందర్ సింగ్ వాధ్వా తెలిపారు. లంగర్ సాహిబ్‌కు చెందిన బాబా బల్విందర్ సింగ్ మాట్లాడుతూ ఈ కాంప్లెక్స్‌లో ఇంకా వివిధ రాష్ట్రాలకు చెందిన సుమారు 175 మంది ఉన్నట్టు చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here