దేశంలో 40వేలకు చేరువగా పాజిటివ్ కేసులు.. మరణాలన్నీ ఆ పది రాష్ట్రాల్లోనే

పాజిటివ్ కేసుల్లో శనివారం కొత్త రికార్డు నమోదైంది. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు 24 గంటల్లో 2,400 కేసులు నమోదయ్యాయి. గంటకు సగటున వందకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటివరకూ ఒక్క రోజులో సెద్ద సంఖ్యలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. శుక్రవారంతో పోలిస్తే 6.81% వృద్ధి నమోదైంది. ఇప్పటివరకూ 10,018 మంది కోలుకోగా, 1,223 మంది ప్రాణాలు కోల్పోయారు. 24 గంటల్లో 953 మంది (10.5%) కోలుకొని ఇళ్లకు చేరుకోగా, గంటకు సగటున ముగ్గురు చొప్పున 71 మంది ప్రాణాలు వదిలారు. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 39,980కి చేరుకోగా.. ఇప్పటి వరకూ 1,323 మంది మృతిచెందారు.

శనివారం నమోదయిన మొత్తం కేసుల్లో 41.29 శాతం మహారాష్ట్రలోనే ఉన్నాయి. ఆ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 12,296 చేరుకోగా.. మొత్తం 521 మంది ప్రాణాలు కోల్పోయారు. శనివారం 1,000కిపైగా కేసులు నమోదు కాగా.. మరో 40 మంది ప్రాణాలు కోల్పోయారు. గుజరాత్‌లోనూ పాజిటివ్ కేసుల సంఖ్య 5వేలు దాటింది. మహారాష్ట్ర తర్వాతే గుజరాత్‌లోనే వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. మొత్తం 262 మంది చనిపోయారు. ఢిల్లీలోనూ వైరస్ కేసుల సంఖ్య 4వేలు దాటగా.. 64 మంది మృత్యువాతపడ్డారు.

ఇదిలా ఉండగా 13 రాష్ట్రాల్లో కొత్త కేసులు నమోదుకాలేదు. గడచిన 24 గంటల్లో పది రాష్ట్రాల్లోనే మరణాలు సంభవించాయి. తొమ్మిది రాష్ట్రాల్లో 1,000కిపైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క మహారాష్ట్రలోనే 12,296 మంది వైరస్ బారిపడితే.. హ్మదాబాద్‌లో 24 గంటల్లో 20 మంది చనిపోయారు. ఢిల్లీలో పాజిటివ్ కేసులు పెరగడంతో నగరం మొత్తాన్ని రెడ్‌జోన్‌గా ప్రకటించారు. పాజిటివ్ కేసుల జాబితాలో 4వ స్థానంలో ఉన్న మధ్యప్రదేశ్‌లో 24 గంటల్లో ఒక్క కొత్తకేసు నమోదు కాకపోవడం విశేషం. పశ్చిమ బెంగాల్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.

పంజాబ్‌లో ఒకేరోజు 215 మందికి వైరస్ నిర్ధారణ కావడంతో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. నాందేడ్ నుంచి వచ్చివారిలో 91 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కేరళ, ఉత్తరాఖండ్‌, అసోంలలో ఒక్కో కొత్తకేసు మాత్రమే వచ్చాయి. ఐసీఎంఆర్‌ రికార్డు స్థాయిలో గత 24 గంటల్లో 73,709 పరీక్షలు నిర్వహించింది. ఒక్కరోజులో ఇప్పటివరకూ నిర్వహించిన గరిష్ఠ పరీక్షల సంఖ్య ఇదే. మొత్తం పరీక్షలు 9,76,363కి చేరాయి. ఎన్‌డీఎంఏ డ్యాష్‌బోర్డు ప్రకారం మొత్తం కేసులు 43,858కి చేరగా.. ఇది వైద్య ఆరోగ్య శాఖ చెప్పిన లెక్కల కంటే 6,082 అధికం.

ఆంధ్రప్రదేశ్‌లో వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. శనివారం ఒక్కరోజే 62 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కావడంతో మొత్తం బాధితుల సంఖ్య 1525కి చేరింది. వీరిలో ఇప్పటివరకు 33మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక తెలంగాణలో కొత్తగా 17కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1061కి చేరగా 29మంది మరణించినట్లు తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here