దక్షిణ చైనా సముద్రంలో అమెరికా కవ్వింపులు.. బలప్రదర్శన దిగిన డ్రాగన్

చైనా వల్ల కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రమైందని ఆరోపిస్తున్న అమెరికా.. చైనాపై గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా దక్షిణ చైనా సముద్రంలోకి అమెరికా యుద్ధ నౌక ప్రవేశించడం చైనా ఆగ్రహానికి కారణమైంది. తైవాన్ జలసంధి మీదుగా వెళ్లిన యూఎస్ఎస్ బార్రీ యుద్ధ నౌక దక్షిణ చైనా జలాల్లో తిరగాడటం డ్రాగన్‌కు రుచించలేదు. అమెరికా వార్ షిప్‌ను వెనక్కి పంపడం కోసం చైనా సైన్యం ఎయిర్‌క్రాఫ్ట్‌లు, నౌకలను పంపింది. ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్‌తో బల ప్రదర్శనకు దిగింది. గైడెడ్ మిస్సైల్ డిస్ట్రయర్ అయిన యూఎస్ఎస్ బారీని అమెరికా దక్షిణ చైనా సముద్రంలోకి పంపడాన్ని రెచ్చగొట్టే చర్యగా చైనా అభివర్ణించింది. అమెరికా చర్య తమ సార్వభౌమత్వానికి విఘాతం కలిగించేలా ఉందని ఆరోపించింది.

‘ఈ ప్రాంతంలో శాంతి భద్రతలను అస్థిరపరిచాలని చూసే బదులు మీ దేశంలో కరోనాను కట్టడిపై శ్రద్ధ పెట్టండి’ అని అమెరికా సైన్యానికి చైనా మిలిటరీ అధికార ప్రతినిధి సలహా ఇచ్చారు. దక్షిణా చైనా సముద్రంలోని పార్సెల్ దీవులు, వియత్నాంలోని హోయాంగ్ సా ద్వీప సమూహం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక్కడ 30కిపైగా దీవులు చైనా నియంత్రణలో ఉన్నాయి. కానీ ఆ దీవులపై తమకూ హక్కు ఉందని తైవాన్, వియత్నాం వాదిస్తున్నాయి.

వ్యూహాత్మక ప్రాంతం కావడంతోపాటు దక్షిణ చైనా సముద్రం అడుగున ఉన్న ఖనిజ సంపదపై చైనా కన్నేసింది. ఈ సాగర జలాలపై తమకే హక్కు ఉందని చైనా పేర్కొంటుండగా.. వియత్నాం, తైవాన్‌తోపాటు ఫిలిప్పిన్స్, బ్రూనై, మలేసియా, ఇండోనేసియా దేశాలు తమకు కూడా హక్కుందని వాదిస్తున్నాయి. దీంతో దక్షిణ చైనా సముద్రం వివాదాస్పదంగా మారింది.

గతంలోనూ తైవాన్ జలసంధి మీదుగా అమెరికా యుద్ధ నౌక ఈ మార్గంలో పయనించగా.. చైనా తీవ్రంగా స్పందించింది. అంతర్జాతీయ చట్టాలను, నిబంధలను అమెరికా ఉల్లంఘించిందని చైనా ఆరోపించింది. తమ దేశ సార్వభౌమత్వానికి, ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా, ఈ ప్రాంతంలో అస్థిరతను పెంచేలా అమెరికా వ్యవహరిస్తోందని మండిపడింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here