కిరణ్ బేడీ vs మల్లాడి.. మంత్రి పదవికి రాజీనామా చేస్తానంటున్న యానాం నేత

లాక్ డౌన్ సమయంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను పాటించకుండా లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ తీసుకుంటున్న నిర్ణయాలపై పుదుచ్చేరి మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. మూడు రోజులుగా చెక్ పోస్టు దగ్గర పడిగాపులు కాస్తున్న వారిని 24 గంటల్లోగా యానాంలోకి అనుమతించకపోతే.. ఇతర డిమాండ్లను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించకపోతే జూన్ 6న తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని మల్లాడి ప్రకటించారు. ఈ విషయమై ఇప్పటికే పుదుచ్చేరి సీఎంకు లేఖ రాశానన్నారు.

కిరణ్ బేడీ ప్రకటనలకే ప్రాధాన్యం ఇస్తున్నారని.. ఆమె దగ్గర మంత్రిగా పని చేస్తున్నందుకు సిగ్గుపడుతున్నాననంటూ మల్లాడి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. మిగతా గవర్నర్ల కంటే ఆమె అధికంగా ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. గత 35 రోజుల్లో ప్రజలకు నిత్యావసరాలు, డబ్బులు అందాయో లేదో తెలుసుకునే ప్రయత్నం కూడా ఆమె చేయలేదన్నారు.

‘లాక్‌డౌన్ నిబంధనలను యానాం ప్రజలు తూచా తప్పకుండా పాటించడం వల్ల కరోనా వైరస్‌ను కట్టడి చేయగలిగాం. పుదుచ్చేరి సీఎంతో కలిసి నేను కూడా ప్రధాని మోదీతో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నాను’ అని మంత్రి మల్లాడి తెలిపారు. కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలను చెల్లించాలని ప్రధానిని సీఎం కోరారన్నారు.

విద్య, ఉపాధి అవకాశాల కోసం వేరే ప్రాంతాలకు వెళ్లిన యానాం ప్రజలు వేరే ప్రాంతాల్లోనే ఉండిపోయారన్నారు. వేరే ప్రాంతాల నుంచి వచ్చే యానాం ప్రజలను క్వారంటైన్లో ఉంచి ఇళ్లకు పంపాలని నిర్ణయించామన్నారు. యానాం ఓల్డేజ్ హోం సహకారంతో వారికి ఆహారం, ఇతర వసతులు కల్పించామన్నారు. క్వారంటైన్లో ఉంచడం కోసం అవసరమైతే తన ఇంట్లో కొంత భాగాన్ని వాడుకోవాలని సూచించామన్నారు.

కానీ యానాం వాసులైనా సరే.. బయటకు వెళ్లిన వారిని లోపలికి అనుమతించొద్దని లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాలు జారీ చేశారని అధికారులు తెలిపారన్నారు. గత రెండు రోజులుగా ఆరుగురు వైఎస్ఆర్ విగ్రహం వద్ద సరిహద్దుల్లో ఉన్నారని మల్లాడి తెలిపారు. మంగళవారం మరొకరు కూడా యానాం సరిహద్దుల్లో ఎదురు చూస్తున్నారని తెలిపారు. ‘మన వాళ్లను బయట ఉంచడం నా మనసుకు కష్టంగా తోచింది. వారికి వైరస్ వచ్చినా ఇంటికి పంపడం లేదు. 24 గంటల్లోగా ఈ సమస్యను పరిష్కరించకపోతే… మంత్రి పదవికి రాజీనామా చేస్తా’నని మల్లాడి హెచ్చరించారు. యానాంలో జరిగిన అభివృద్ధి చాలనే ఈర్ష్యతోనే ఇక్కడ జరిగే అభివృద్ధి కార్యక్రమాలను లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ ఆలస్యం చేస్తున్నారని మాల్లాడి ఆరోపించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here