కరోనా నుంచి ఆ శక్తే భారతీయులను కాపాడుతుంది: చైనా వైద్యుడు

కరోనా వైరస్‌ తట్టుకునే రోగనిరోధక శక్తి భారతీయులకు లేకపోయినా వారికున్న మానసిక శక్తే వారిని రక్షిస్తుందని చైనాకు చెందిన ప్రముఖ వైద్య నిపుణుడు అభిప్రాయపడ్డారు. షాంఘై చైనా వైద్య నిపుణుడు జాంగ్‌ వెన్‌హాంగ్‌ భారత్‌లోని చైనా విద్యార్థులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. భారత్‌లో మాస్క్‌లు ల్లేకుండా ప్రజలు ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించడం చూశాను.. కొవిడ్‌-19ను ఎదుర్కొనే రోగనిరోధకశక్తి లేకున్నా మానసిక స్థైర్యం భారతీయులకు ఉందని ఈ సందర్భంగా వెన్‌హాంగ్ అన్నారు. షాంఘై‌లోని హౌషన్‌ ఆసుపత్రిలో అంటువ్యాధుల విభాగానికి డైరక్టర్‌గా ఉన్న ఝాంగ్‌.. భారతీయులు ప్రశాంతమైన మనస్తత్వం కలిగినవారని, అందుకే కరోనా వైరస్‌ను దీటుగా ఎదుర్కోగలరనే అభిప్రాయం వ్యక్తం చేశారు.

భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ అమెరికాతో పోలిస్తే చాలా తక్కువేనని పేర్కొన్నారు. అత్యధిక జనాభా కలిగిన దేశంలో ప్రస్తుతం నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య తక్కువే అన్నారు. భారత్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తి 10శాతం కూడా మించదని… మీ చుట్టూ ఉండే 90శాతం మంది వైరస్‌ సోకనివారేనని భారత్‌లో ఉన్న చైనా విద్యార్థులకు ఆయన భరోసా ఇచ్చారు. శుక్రవారం నాటికి దేశవ్యాప్తంగా 23వేల కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 718మంది మరణించినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇక ప్రపంచవ్యాప్తంగా 28 లక్షల మంది వైరస్‌ బారినపడగా.. మరణాల సంఖ్య రెండు లక్షలకు చేరువవుతోంది.

షాంఘైలోని ‘కొవిడ్‌-19 క్లినికల్‌ ఎక్స్‌పర్ట్‌ టీం’కి నేతృత్వం వహిస్తున్న వెన్‌హాంగ్‌.. మహమ్మారి నుంచి చైనా సహా ప్రపంచ దేశాలు ఇప్పుడు బయటపడ్డా నవంబర్‌లో తిరిగి మరోసారి ప్రబలే అవకాశం ఉందని ఇటీవల హెచ్చరించిన విషయం తెలిసిందే. రాబోయే రోజుల్లో కరోనా మళ్లీ మళ్లీ దాడి చేసే ప్రమాదం ఉన్నందున, ప్రభుత్వాలు అందుకు తగ్గట్టు విధానాలను రూపొందించుకోవాలని ఆయన సూచించారు.

అమెరికాలో మే చివరినాటికి వైరస్ అదుపులోకి వస్తుందని, ఇరు దేశాలు ఒకరికొకరు సహకరించుకుని దీనిపై పోరాటం చేయాలని సూచించారు. వైద్యస్థాయిలో అమెరికా, చైనాల మధ్య సంబంధాలు నిరంతం కొనసాగుతున్నాయని తెలిపారు. ఔషధాలు, ప్రజల ఆరోగ్యం, అంటువ్యాధి నియంత్రణ విషయానికి వస్తే ఒకొరికరం సహకరించుకుంటున్నామని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here