ఉద్దవ్‌కు బిగ్ రిలీఫ్.. మే 27లోపు ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈసీ గ్రీన్ సిగ్నల్

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు ఊరట లభించింది. ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర అనుమతినిచ్చింది. మే 27లోపు ఖాళీగా ఉన్న 9 స్థానాలకు ఎన్నికల నిర్వహించేందుకు ఈసీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో సీఎం ఉద్దవ్‌ పదవీ గండం నుంచి గట్టెక్కినట్టుయ్యింది. ముఖ్యమంత్రిగా ఉద్దవ్ బాధ్యతలు చేపట్టి మే 27 నాటికి ఆరు నెలలు పూర్తికావస్తుండగా.. ఆయన ఇంత వరకూ ఏ సభకూ ఎన్నిక కాలేదు. నవంబరు 28న ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 ప్రకారం.. పదవిని చేపట్టిన ఆరు నెలల్లోగా ఆయన ఎమ్మెల్యే లేదంటే ఎమ్మెల్సీ కావాల్సి ఉంటుంది.

అధికార కూటమి, అందులోనూ సీఎం కాబట్టి ఆయన ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం లాంఛనమే అనుకున్నారు. మార్చి 26న 9 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాలని భావించారు. కానీ కరోనా తీవ్రతరం కావడం.. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో.. ఎమ్మెల్సీ ఎన్నికలు నిరవధికంగా వాయిదాపడ్డాయి. వాస్తవానికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటన చేయడానికి ముందే ఉద్దవ్ సర్కారు మహారాష్ట్రలో లాక్‌డౌన్ ప్రకటించింది.

ఉద్ధవ్‌ను గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీగా నామినేట్ చేయాలని మహారాష్ట్ర కేబినెట్ సిఫారసు చేసినా గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. స్వయంగా ముఖ్యమంత్రి రంగంలోకి దిగి బుధవారం గవర్నర్ను కలిసి, ఎన్నికలపై చర్చించారు. దాదాపు ఇరువురి మధ్య 20 నిమిషాల పాటు సమావేశం జరిగింది. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై ఎన్నికల కమిషన్‌కు గవర్నర్ గురువారం లేఖ రాశారు. ఏప్రిల్ 24 నుంచి 9 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయని, వీటి భర్తీపై నిర్ణయం తీసుకోవాలని ఆయన తన లేఖలో కోరారు.

ఇదిలా ఉండగా.. ప్రధాని నరేంద్ర మోదీకి సైతం ఉద్ధవ్ ఫోన్ చేసి ఆయన సాయం కోరారు. బుధవారం సాయంత్రం ప్రధాని మోదీకి ఫోన్ చేసిన ఉద్ధవ్ థాక్రే.. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను వివరించారు. మహారాష్ట్ర లాంటి పెద్ద రాష్ట్రంలో, అందునా కోవిడ్ మహమ్మారి విజృంభిస్తోన్న వేళ రాజకీయ అస్థిరత అనేది సరైంది కాదన్న ఉద్దవ్.. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని ప్రధాని మోదీని కోరారు.

ఎమ్మెల్సీగా తనను గవర్నర్ నామినేట్ చేయకపోతే తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుందని ఉద్దవ్ ప్రధానికి తెలిపారు. దీంతో ఈ విషయం తాను చూసుకుంటానని.. మరిన్ని వివరాలను తెలుసుకుంటానని మహా సీఎంకు ప్రధాని భరోసా ఇచ్చారు. ప్రధాని జోక్యం, గవర్నర్ లేఖకు స్పందించిన ఈసీ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here