సీఆర్పీఎఫ్‌ను వెంటాడుతున్న కరోనా.. హెడ్‌క్వార్టర్స్ మూసివేత

తీవ్రత రోజు రోజుకూ పెరుగుతోంది. వైరస్‌పై ముందుండి పోరాటం చేస్తున్న వైద్యులు, నర్సులు, ఆరోగ్య సిబ్బంది, పోలీసులు సైతం వైరస్ బారినపడుతున్నారు. తాజాగా, ఢిల్లీలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) ప్రధాన కార్యాలయంలోని ఓ అధికారికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో సీఆర్పీఎఫ్ కార్యాలయాన్ని అధికారులు మూసివేశారు. స్పెషల్ డైరెక్టరేట్ జనరల్ (ఎస్డీజీ) వ్యక్తిగత కార్యదర్శి స్థాయి అధికారికి కరోనా వైరస్ నిర్ధారణ కావడంతో కార్యాలయాన్ని మూసివేసినట్టు సీఆర్పీఎఫ్ ప్రకటించింది.

ఆదివారం నుంచి కార్యాలయంలోకి ఎవర్నీ అనుమతించబోమని తెలిపారు. లోడి రోడ్డులోని సీజీఓ కాంప్లెక్స్‌లో ఉన్న తమ ప్రధాన కార్యాలయంలో ఓ అధికారికి కరోనా సోకినట్టు జిల్లా కరోనా నియంత్రణ అధికారులకు సీఆర్పీఎఫ్ సమాచారం అందజేసింది. దీంతో కార్యాలయాన్ని మూసివేసి, శానిటైజేషన్ చేపట్టారు. శానిటైజేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాతే కార్యాలయం తెరవనున్నారు.

ప్రస్తుతం పాజిటివ్‌గా తేలిన ఉద్యోగితో కాంటాక్ట్ అయినవారిని గుర్తిస్తున్నామని అధికారులు తెలిపారు. దేశంలోనే అతిపెద్ద పారామిలటరీ దళం సీఆర్పీఎఫ్‌కు క్వారంటైన్‌ గడువు విషయంలో కేంద్ర హోంశాఖ చేసిన తప్పిదం శాపంగా మారింది. తూర్పు ఢిల్లీలోని సీఆర్‌పీఎఫ్‌ 31వ బెటాలియన్‌ కరోనా బారిన పడింది. మయూర్‌ విహార్‌ ఫేజ్‌-3 ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న ఈ బెటాలియన్‌కు చెందిన 135 మంది జవాన్లకు కరోనా సోకడానికి హోంశాఖ నిర్ణయమే కారణమని భావిస్తున్నారు.

కశ్మీర్‌లోని 162వ బెటాలియన్‌కు చెందిన ఇక్రం హుస్సేన్‌ (55) అనే సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఏప్రిల్‌ 7న మయూర్‌ విహార్‌ బెటాలియన్‌లో చేరారు. అదే రోజు హుస్సేన్‌కు అస్వస్థతగా ఉండడంతో కరోనా పరీక్ష నిర్వహించారు. రెండ్రోజుల తర్వాత వచ్చిన ఫలితంలో ఆయనకు కరోనా సోకినట్లు తేలింది. దీంతో అతడిని చికిత్స కోసం సఫ్దర్‌జంగ్‌ ఆసుపత్రిలో చేర్పించారు. ఆ జవానను చికిత్స పొందుతూ ఏప్రిల్‌ 27న చనిపోయారు. కానీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. బెటాలియన్‌లో 480 మంది సిబ్బంది నుంచి నమూనాలు సేకరించి పరీక్షలకు పంపగా వీరిలో 458 మంది ఫలితాలు వచ్చాయి. 135 మందికి కరోనా పాజిటివ్‌గా శనివారం తేలింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here