వైరస్ గురించి నిజాల్ని చైనా దాచిపెట్టడానికి కారణం ఇదేనా.. అమెరికా ఇంటెలిజెన్స్ నివేదిక

కరోనా వైరస్‌ విషయంలో చైనా వ్యవహరించిన తీరుపై అనేక అనుమానాలు, ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. బయట ప్రపంచానికి తెలియనీయకుండా గుంబనంగా వ్యవహరించిందని, కావాలనే నిర్లక్ష్యం చేసిందని అమెరికా పదే పదే ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా, మరోసారి విషయంలో చైనాపై అగ్రరాజ్యం విమర్శలు గుప్పించింది. చైనా అలా చేయడానికి కారణాలను చెప్పుకొచ్చిన అమెరికా… వైరస్‌ను ఎదుర్కోవడానికి అవసరమైన ఔషధాల్ని నిల్వ చేసుకోవాలనే ఉద్దేశంతోనే డ్రాగన్‌ బయటి ప్రపంచానికి దాని తీవ్రతను పంచుకోలేదని ఆరోపించింది.

ఈ విషయాన్ని అమెరికా హోంలాండ్‌ సెక్యూరిటీ విభాగం ఓ నివేదికలో పేర్కొన్నట్లు ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ అసోసియేటెడ్‌ ప్రెస్‌ తెలిపింది. ఓవైపు వైరస్ తీవ్రతను తక్కువ చేసి చూపిన చైనా.. మరోవైపు దిగుమతుల్ని పెంచుకుని, ఎగుమతుల్ని తగ్గించిందని నివేదికలో ఆరోపించింది. అంతేకాదు, ఎగుమతులపై ఎలాంటి ఆంక్షలు లేవని చెబుతూ.. అస్పష్టమైన వాణిజ్య వివరాలతో దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసిందని తీవ్ర ఆరోపణలు చేసింది.

ప్రపంచ దేశాల నుంచి ఔషధాల్ని దిగుమతి చేసుకోవాలన్న ఉద్దేశంతో ప్రపంచ ఆరోగ్య సంస్థకు సైతం ఇది అంటువ్యాధి అన్న విషయం తెలియనీయకుండా జాగ్రత్త పడిందని దుయ్యబట్టింది. ఈ క్రమంలోనే మాస్క్‌లు, సర్జికల్‌ గౌన్లను భారీస్థాయిలో దిగుమతి చేసుకుందని తెలిపింది. చైనా ఎగుమతి, దిగుమతుల్లో వ్యత్యాసాలు అసాధారణంగా ఉన్నాయని.. దీన్ని బట్టే అసలు అంశాన్ని డ్రాగన్ దాచిందన్న విషయం స్పష్టమవుతోందన్నారు.

కరోనా వైరస్ వ్యాప్తికి చైనాయే బాధ్యత వహించాలని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో మరోసారి ఎదురుదాడి చేసిన మర్నాడే ఈ నివేదిక బయటకు రావడం గమనార్హం. కరోనా వైరస్ తీవ్రత గురించి చైనా జాప్యం చేసిందని అమెరికా ఇంటెలిజెన్స్ అధికారుల నివేదిక వెల్లడించిన విషయాన్ని ట్విట్టర్‌లో ట్రంప్ మరోసారి ప్రస్తావించారు. కరోనావైరస్, దాని వ్యాప్తి గురించి ఇంటెలిజెన్స్ అధికారులు, ఇతరులు ముందస్తు హెచ్చరికలు చేసినా.. కట్టడికి చర్యలు తీసుకోవడంలో ట్రంప్ విఫలమయ్యారనే విమర్శలకు ప్రస్తుత నివేదిక ఆయనకు రక్షణగా నిలిచింది.

వైరస్‌ను జన్యుపరంగా వుహాన్ ల్యాబ్‌లోనే తయారు చేశారని, డిసెంబరు తొలివారం నాటికే మహమ్మారి వ్యాప్తి చెందినా ప్రపంచ దేశాలకు తెలియనీకుండా వ్యవహరించిందని డ్రాగన్‌పై అగ్రరాజ్యం విరుచుకుపడుతోంది. కోవిడ్-19 వ్యాప్తిపై చైనా పారదర్శకంగా వ్యవహరించలేదని.. వాస్తవానికి గత ఏడాది నవంబరులోనే ఈ వైరస్‌ గురించి చైనాకు తెలిసే ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తోంది.

వైరస్ విషయంలో చైనా నుంచి భారీగానే నష్టపరిహారం పొందే విషయంపై దృష్టి సారిస్తున్నామని ట్రంప్‌ స్పష్టం చేశారు. ఈ విషయంలో తమ దర్యాప్తు చాలా సీరియస్‌గా జరుగుతోందన్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తికి చైనాను బాధ్యురాలిగా చేసేందుకు చాలా మార్గాలు ఉన్నాయి. చైనా విషయంలో తాము సంతృప్తిగా లేం’ అని వ్యాఖ్యానించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here