విశాఖ ఘటనపై కమిటీ ఏర్పాటు చేసిన కేంద్రం

వి శాఖ గ్యాస్‌ లీకేజీ ఘటనపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఘటనపై ప్రత్యేక కమిటీని నియమించింది. ఈ కమిటీలో కేబినెట్‌ కార్యదర్శి, హోంశాఖ కార్యదర్శి, రసాయన శాఖ కార్యదర్శి తదితరులు ఉన్నారు. విశాఖపట్నంలో ఎల్‌జీ పాలిమర్స్ గ్యాస్‌ లీకేజీ ఘటనపై గురువారం (మే 7) , హోం మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కిషణ్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. గ్యాస్‌ లీకేజీ ఘటనకు దారి తీసిన అంశాలపై చర్చించారు.

సమావేశంలో ఈ ఘటనపై ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. గ్యాస్‌ ప్రభావం తగ్గింపు, బాధితులకు సహాయంపై ఈ కమిటీ చర్యలు తీసుకోనుంది. గ్యాస్‌ లీకేజీ ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంపై కేంద్ర హోమంత్రిత్వ శాఖ, జాతీయ విపత్తు నివారణశాఖా అధికారులతో మాట్లాడానని మోదీ ట్వీట్ చేశారు. బాధితులను ఆదుకునేలా వెంటనే సహాయ చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశించినట్లు మోదీ పేర్కొన్నారు. గ్యాస్‌ లీకేజీ ఘటనలో అస్వస్థకు గురైన వారు వెంటనే కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు మోదీ ట్వీట్‌ చేశారు.

విశాఖ దుర్ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఎన్డీఆర్‌ఎఫ్ వెల్లడించింది. మరో 1000 మంది అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపింది. వీరిలో 30 మంది అపస్మారక స్థితిలో ఉన్నారని వెల్లడించింది. తమ సిబ్బంది 500 మందిని రెస్క్యూ చేసి ఆస్పత్రులకు తరలించిందని తెలిపింది. పరిశ్రమలో సాంకేతిక లోపం వల్లే ఈ ప్రమాదం జరిగిందని విశాఖ కలెక్టర్ వినయ్ చంద్ తెలిపారు.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here