లాక్‌డౌన్: సీజ్ చేసిన వాహనాలతో పోలీసులకు కొత్త చిక్కులు

నిబంధనలను ఉల్లంఘించి రోడ్డెక్కెన వాహనాలను పోలీసులు సీజ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకూ నగరంలోనే లక్షకుపైగా వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. లాక్‌డౌన్ ముగిసిన తర్వాత వీటిని న్యాయస్థానానికి అప్పగించనున్నారు. కానీ సీజ్ చేసిన వాహనాలతో పోలీసులకు కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి. నగరంలో ఖాళీ స్థలాలను గుర్తించి ఈ వాహనాలను ఉంచుతున్నారు. ప్రయివేట్ గ్యారేజీలు, పార్కులు, స్కూల్ ప్రాంగణాల్లోనూ వాహనాలను ఉంచుతున్నారు. అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఖాళీ స్థలాలు ఉండవు కాబట్టి.. చెక్ పోస్టుల సమీపంలో రోడ్డు మీద బారికేడ్లు పెట్టి.. సీజ్ చేసిన వాహనాలను ఉంచుతున్నారు.

హుస్సైనీఆలం, చంద్రాయణగుట్ట, ఆసిఫ్ నగర్, చాదర్‌‌ఘట్ ప్రాంతాల్లో పోలీసు స్టేషన్లకు ఎదురుగానే రోడ్ల మీద బారికేడ్లు పెట్టి.. ఆ స్థలంలో వాహనాలను ఉంచుతున్నారు. వీటిని ఎత్తుకెళ్లకుండా, ఆకతాయిలు లేదా సంఘ విద్రోహక శక్తులు వాహనాలను దగ్ధం చేయకుండా పోలీసులు జాగ్రత్త పడుతున్నారు. చెక్‌పోస్టు డ్యూటీలో ఉన్న పోలీసు సిబ్బందిని వాహనాలను ఉంచి చోటుకు మళ్లించి పహారా కాయిస్తున్నామని ఓ సీనియర్ అధికారి తెలిపారు.

లాక్‌డౌన్ కారణంగా పోలీసులు ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, స్టాఫ్ కొరత లాంటి సమస్యలు ఉండగా.. సీజ్ చేసిన వాహనాల వద్ద కాపలా కోసం సిబ్బందిని పెట్టడం పోలీసు శాఖపై మరింత భారాన్ని మోపుతోంది. అసలే ఇది ఎండా కాలం, సీజ్ చేసిన వాహనాల్లో ఇంధనం ఉంటుంది, పొరబాటున అగ్నిప్రమాదం తలెత్తితే పరిస్థితి ఏంటనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. లాక్‌డౌన్ ముగిసేలోగా దుమ్ము, ధూళి పడి ఆ వాహనాలు ఎలా తయారవుతాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here