లాక్‌డౌన్ పొడిగించాల్సిందే.. ప్రధానికి సీఎంల విజ్ఞప్తి

దే శంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ను మరింత పొడిగించాలని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధాని మోదీని కోరారు. కరోనా వైరస్ కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్ మరో 6 రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ సోమవారం (మే 11) వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో పలువురు ముఖ్యమంత్రులు లాక్‌డౌన్ పొడిగించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. లాక్‌డౌన్‌ పొడిగించమని కోరిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర, పంజాబ్‌, పశ్చిమ బెంగాల్‌ ఉన్నట్లు సమాచారం.

బిహార్‌లో లాక్‌డౌన్‌ మరికొన్ని రోజులు పొడిగిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్.. ప్రధాని మోదీతో అన్నారు. ఒకసారి లాక్‌డౌన్‌ ఎత్తివేస్తే, ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున బిహార్‌కు వస్తారని.. అప్పుడు కరోనా కేసుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

తమ రాష్ట్రానికి మే 31 వరకు రైళ్లు, విమాన రాకపోకలు అనుమతించవద్దని తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి కోరారు. రాష్ట్రానికి రూ.3 వేల కోట్ల విలువైన మెడికల్‌ పరికరాలు కావాలని తెలిపారు. తమిళనాడుకు అత్యవసరంగా ఆర్‌టీ-పీసీఆర్‌ టెస్టింగ్‌ కిట్ల అవసరం ఉందని కోరారు. వలస కూలీలను తరలించేందుకు మరో రూ.2,500 కోట్లు అవసరమని ప్రధానికి పళని స్వామి తెలిపారు.

రైళ్లను ఇప్పుడప్పుడే ప్రారంభించవద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. అందుకు కారణాలను కూడా వివరించారు. రైలు ప్రయాణికులందరినీ క్వారంటైన్‌ చేయడం సాధ్యం కాదని.. అంతేకాకుండా దేశంలో ప్రధాన నగరాల్లోనే కరోనా ప్రభావం అధికంగా ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయంపై పునరాలోచన చేయాలని కేసీఆర్ సూచించారు. దశల వారీగా ప్రయాణికుల రైళ్లను నడిపేందుకు కేంద్రం నిర్ణయించిన నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here