రెండు రోడ్డు ప్రమాదాలు.. 14మంది వలసకూలీలు మృతి

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో పెను విషాద సంఘటన చోటుచేసుకుంది. ముజఫర్‌నగర్‌-సహరాన్పూర్‌ రహదారిపై గలౌలి చెక్‌పోస్టు వద్ద గడిచిన రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా వచ్చిన బస్సు రోడ్డు వెంబడి స్వస్థలాలకు నడుచుకుంటూ వెళ్తున్న వలస కూలీలపైకి దూసుకెళ్లింది. దీంతో ఆరుగురు వలస కూలీలు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. గుర్తుతెలియని బస్సు డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సుదీర్ఘ నడక గమ్యం చేరకముందే ఇలా అర్ధాంతరంగా అసువులు బాశారు వలస కూలీలు.

మధ్యప్రదేశ్‌లోని గునా జిల్లా కాంట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గడిచిన రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వలస కూలీలతో వెళ్తున్న ట్రక్కు అదుపుతప్పి బస్సును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ట్రక్కులో ప్రయాణిస్తున్న 8 మంది మృతిచెందారు. మరో 50 మందికి పైగా గాయపడ్డారు. బాధితులను చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. వలస కూలీలు మహారాష్ట్ర నుంచి స్వరాష్ట్ర ఉత్తరప్రదేశ్‌కు వెళ్తుండగా ప్రమాదం భారిన పడ్డారు.

మహారాష్ట్రలోని ఔరంగబాద్‌లో ఘోర రైలు ప్రమాదంలో 16మంది వలస కూలీలు మృతి చెందిన విషయం తెలిసిందే. కర్మాడ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ట్రాక్‌పై నిద్రిస్తున్న వలస కూలీలపై గూడ్స్‌ రైలు దూసుకెళ్లింది. ఈప్రమాదంలో 16 మంది మృతి చెందారు. మృతుల్లో, ఎక్కువ మంది మహిళలు, చిన్నారులు ఉన్నారు. మృతులంతా మధ్యప్రదేశ్‌కు వెళ్తున్న వలస కార్మికులు. పట్టాలపై నిద్రిస్తున్న వారిని రైలు వేగంగా ఢీకొనడంతో మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి. మహారాష్ట్రలోని జాల్‌నా నుంచి వలస కూలీలు మధ్యప్రదేశ్‌కు రైలు పట్టాలను అనుసరిస్తూ బయల్దేరారు. మార్గమధ్యంలో విశ్రాంతికోసం నిద్రిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here