రెండు రోజుల ముచ్చటే.. మందుబాబుల దెబ్బకు ముంబైలో షాప్‌లు బంద్

మూడో విడత లాక్‌డౌన్‌లో మరికొన్ని కార్యకలాపాల ప్రారంభానికి ఆంక్షలతో కూడిన మినహాయింపులను కేంద్రం ఇచ్చిన విషయం తెలిసిందే. ముఖ్యంగా గ్రీన్, ఆరెంజ్, రెడ్ జోన్‌లలో మద్యం దుకాణాలు తెరవడానికి అనుమతించింది. దీంతో దేశవ్యాప్తంగా సోమవారం నుంచి మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. దాదాపు 42 రోజుల తర్వాత దుకాణాలు తెరుచుకోవడం మందుబాబుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. భౌతికదూరం పాటించాలన్న నిబంధనను తుంగలోకి తొక్కి మద్యం కోసం ఎగబడ్డారు. కనీసం మాస్క్‌లు కూడా ధరించకుండా.. వందలాదిగా గుమిగూడి నిబంధనలను ఉల్లంఘించారు.

ఈ నేపథ్యంలో ముంబైలో మద్యం దుకాణాలు మూసేయాలని బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయం తీసుకుంది. ప్రజలు భౌతిక దూరాన్ని విస్మరించడంతో అన్ని షాపులనూ మూసివేయాలని అధికారుల నిర్ణయించారు. లాక్‌డౌన్ నుంచి మినహాయింపులు ఇస్తూ, దేశంలోని అన్ని ప్రాంతాల్లో మద్యం దుకాణాలు తెరచుకునేందుకు అనుమతించగా, ముంబై వాసులకు మాత్రం అది రెండు రోజుల ముచ్చటగానే నిలిచింది. కరోనా కేసుల సంఖ్య తగ్గకపోవడం, వైన్స్ షాపుల వద్ద ప్రజలు భౌతిక దూరాన్ని మరవడంతో, తీవ్రంగా స్పందించిన బృహన్ ముంబయి కార్పొరేషన్ అధికారులు, మద్యం దుకాణాలను బుధవారం నుంచి తెరవరాదని ఆదేశాలు జారీ చేశారు.

కేవలం నిత్యావసరాలు, ఔషధాలు మినహా మరే ఇతర షాపులను కూడా తెరిచేందుకు వీల్లేదని ఆంక్షలు విధించారు. కాగా, ముంబైలో మంగళవారం కొత్తగా మరో 500కు పైగా కరోనా కేసులు నమోదు కావడంతో, మొత్తం కేసుల సంఖ్య 10 వేలకు చేరువలో ఉంది. మొత్తం మహారాష్ట్రలో పాజిటివ్ కేసుల సంఖ్య 15 వేలు దాటడంతో ప్రభుత్వం మరిన్ని కఠిన చర్యలను తీసుకోవాలని భావిస్తోంది.

లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లఘించి, దుకాణాల దగ్గర జనం భారీగా గుమిగూడినట్టు పలు నివేదికలు, మీడియా, సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వార్తలు, పోలీసులు, ఇతర అధికారుల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఈ సమయంలో భౌతిక దూరాన్ని కొనసాగించడం అసాధ్యమని, ఒకే చోట గుమిగూడటం వల్ల పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుందని బీఎంసీ పేర్కొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here