మహారాష్ట్ర సీఎంకి పొంచి ఉన్న పదవీ గండం.. ఆయన ఫేట్ గవర్నర్ చేతుల్లో!

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన అధినేత గతేడాది నవంబరు 27 బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. చట్టసభలో ఉద్ధవ్ ప్రతినిధి కాకపోయినా కూటమి తరఫున ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 నిబంధనల ప్రకారం.. చట్టసభలో ప్రతినిధికాని వ్యక్తులు సీఎం లేదా మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆరు నెలల్లోగా ఏదో ఒక సభకు ఎన్నికావాల్సి ఉంటుంది. వాస్తవానికి ఉద్ధవ్ సీఎంగా ప్రమాణం చేసి మే 27తో ఆరు నెలలు పూర్తవుతోంది. ఈలోగా ఆయన ఏదో ఒక సభ (శాసనసభ, శాసన మండలి)లో సభ్యుడిగా చేరాలి. దీంతో ఉద్దవ్‌కు పదవీ గండం పొంచి ఉంది.

ఈ నేపథ్యంలో మహారాష్ట్ర సర్కారు మరొకసారి గవర్నర్ తలుపు తట్టింది. ముఖ్య‌మంత్రి ఉద్ద‌వ్ ఠాక్రేను శాస‌న మండ‌లి స‌భ్యునిగా నామినెట్ చేయాలంటూ గ‌వ‌ర్న‌ర్ భ‌గ‌త్‌సింగ్ కోష్యారిని మంత్రివ‌ర్గం మ‌రోసారి అభ్య‌ర్థించింది. దేశంలోనే అత్యధికంగా కరోనా వైరస్ కేసులు మహారాష్ట్రలో నమోదు కావడంతో మహమ్మారిని కట్టడిచేసే పనిలో సీఎం ఉద్దవ్‌ చాలా బిజీ అయ్యారు. డిప్యూటీ సీఎం అజిత్ ప‌వార్ అధ్య‌క్ష‌త‌న సోమ‌వారం ఏర్పాటైన క్యాబినెట్ స‌మావేశంలో ఈ మేర‌కు తీర్మానించింది. రెండు వారాల కిందటే ఈ ప్ర‌తిపాద‌న‌ను గ‌వ‌ర్న‌ర్ ముందుంచారు. అయితే కోష్యారి మాత్రం ఇప్ప‌టివ‌ర‌కు ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేదు. దీంతో మరోసారి మంత్రుల బృందం గవర్నర్‌ను మంగళవారం కలిసింది.

ఎన్సీపీ నుంచి మంత్రులు అజిత్ పవార్, జయంత్ పాటిల్, శివసేన నుంచి ఏక్‌నాథ్ షిండ్, అనిల్ పరాబ్, కాంగ్రెస్ నుంచి బాలాసాహెబ్ థోరల్, అస్లామ్ షైక్‌లు గవర్నర్‌ను కలిసి… క్యాబినెట్ ప్రతిపాదనను గుర్తుచేశారు. సీఎం ఉద్ధవ్ ఠాక్రేను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమించాలని కోరారు. ఈ ప్రతిపాదనను విన్న గవర్నర్ భగత్‌సింగ్ కోష్యారీ.. ఎలాంటి హామీ ఇవ్వలేదు.. దీనిని ఆయన అంగీకరిస్తారో? లేదో తమకు తెలియదు అని క్యాబినెట్‌లోని సీనియర్ మంత్రి అన్నారు. ఠాక్రే నామినేషన్‌పై అనిశ్చితి దృష్ట్యా శాసనమండలికి ముందస్తు ఎన్నికల కోసం ఎన్నికల సంఘాన్ని సంప్రదించాలని ప్రభుత్వం పరిశీలిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.

వాస్తవానికి మహారాష్ట్రలోని తొమ్మిది ఎమ్మెల్సీ స్థానాలకు ఏప్రిల్ 24న ఎన్నిక జరగాల్సి ఉండగా.. కరోనా తీవ్రత దృష్ట్యా వాటిని ఎన్నికల కమిషన్ వాయిదావేసింది. దీంతో గవర్నర్ కోటాలో తనను ఎమ్మెల్సీగా నామినేట్ చేయాలని ఉద్ధవ్ కోరారు. రెండు సీట్లు ఖాళీగా ఉండటంతో అందులో ఒకరిని ఉద్ధవ్‌‌కు నామినేట్ చేయాలని క్యాబినెట్ కోరింది. ఏప్రిల్ 9నే ఈ ప్రతిపాదనను పంపినా.. గవర్నర్ మాత్రం ఇంత వరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో సోమవారం కొత్తగా మరో తీర్మానం చేసిన క్యాబినెట్.. దానిని గవర్నర్‌కు మంగళవారం అందజేసింది.

మే 27 నాటికి ఠాక్రే సీఎంగా ఎన్నికై ఆరు నెలల ముగియనుంది. ఈ లోపు ఏదైనా స‌భ‌కు ఎన్నిక కాక‌పోతే ఉద్ద‌వ్ ఠాక్రే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ఒక నెల స‌మ‌యం మాత్ర‌మే ఉంది. క‌రోనా సంక్షోభంలో ఇప్పుడు ఎన్నిక‌లు జ‌రిగే ప్ర‌స‌క్తి లేదు. ఈ నేప‌థ్యంలో గ‌వ‌ర్న‌ర్ నిర్ణ‌యంపైనే రాష్ర్ట రాజ‌కీయాలు ఏ మ‌లుపు తిరుగుతాయన్నది అక్కడ ఆసక్తికరంగా మారింది. మంత్రి వర్గ తీర్మానాన్ని ఆమోదించకపోతే ఆయన పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి వస్తుంది. .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here