మద్యం అమ్మకాలపై మద్రాస్ హైకోర్టు బ్యాన్.. సుప్రీం గడపతొక్కిన తమిళనాడు

మూడో దశ లాక్‌డౌన్‌లో కొన్ని కార్యకలాపాలకు మినహాయింపులు ఇచ్చిన కేంద్రం.. మద్యం అమ్మకాలకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో, అన్ని రాష్ట్రాల్లో ప్రారంభమయ్యాయి. అయితే, మద్యం దుకాణాల వద్ద భౌతికదూరం పాటించకుండా లాక్‌డౌన్ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. కరోనా వైరస్ పాజిటివ్ కేసులు అధికంగా నమోదవుతున్న రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మద్రాసు హైకోర్టు శుక్రవారం కీలక ఆదేశాలు జారీచేసింది.

కరోనా నేపథ్యంలో సామాజిక దూరం పాటించకపోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ షాపులు మూసేయాలని ఆదేశాలిచ్చింది. మద్యం ఏమీ నిత్యవసర వస్తువు కాదని.. అలాంటప్పుడు మద్యం విక్రయాలు జరపాల్సిన అవసరం లేదని న్యాయస్థానం అభిప్రాయపడింది. మద్యం అమ్మకాలను నిలిపివేయాలని.. కావాలంటే ఆన్‌లైన్ ద్వారా మద్యాన్ని విక్రయించుకోవచ్చని తమిళనాడు ప్రభుత్వానికి సూచించింది.

దీంతో, హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మద్యం అమ్మకాలకు అనుమతించాలని కోరింది. అంతేకాదు, హైకోర్టు ఆదేశాలు సర్వోన్నత న్యాయస్థానం మార్గదర్శకాల స్ఫూర్తి దెబ్బతీసేవిగా ఉన్నాయని తమిళనాడు ప్రభుత్వం తన పిటిషన్‌లో పేర్కొంది. ‘తమిళనాడులోని మద్యం దుకాణాలన్నీ ప్రభుత్వ సంస్థ టాస్మాక్ ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి.. అందువల్ల, హైకోర్టు ఉత్తర్వులు రాష్ట్ర నికర ఆదాయంపై ప్రభావం చూపుతుంది.. రాష్ట్రంలో మద్యం అమ్మకం నిరవధికంగా నిలిచిపోయి, ఆదాయ, వాణిజ్య కార్యకలాపాలకు తీవ్ర నష్టాలకు దారితీస్తుంది’ అని తన పిటిషన్‌లో వెల్లడించింది.

ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం విచారించే అవకాశం ఉంది. తమిళనాడులో కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్న సంగతి తెలిసిందే.

కాగా, లాక్‌డౌన్‌ ముగిసే వరకు అమ్మకాలు జరపొద్దని.. ఈ నెల 17 వ తేదీ వరకూ మద్యం విక్రయాలను నిలిపివేయాలని స్పష్టం చేసింది. ప్రభుత్వ మద్యం దుకాణాలలో విక్రయాలకు సంబంధించి గడచిన 48 గంటల వీడియోను పరిశీలించిన కోర్టు.. వెంటనే అమ్మకాలు ఆపేయాలని స్పష్టం చేసింది. అప్పటి వరకు అమ్మకాలు జరపడానికి వీల్లేదని న్యాయస్థానం ఆదేశించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here