భద్రతా దళాలకు భారీ విజయం.. ఎన్‌కౌంటర్‌లో హిజ్బుల్ చీఫ్‌ రియాజ్ నయికూ హతం

శ్రీనగర్: భారత భద్రతా దళాలకు భారీ విజయం దక్కింది. ఉగ్రవాద సంస్థ జమ్మూ కశ్మీర్ విభాగం చీఫ్ ఎన్‌‌కౌంటర్లో హతమయ్యాడు. బుధవారం దక్షిణ కశ్మీర్లోని పుల్వామా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్లో అతడ్ని భద్రతా దళాలు మట్టుబెట్టాయి. రియాజ్ నయికూ బియిఘ్‌బొరా గ్రామంలో ఉన్నాడనే సమాచారం నిర్ధారణ కాగానే.. ముందు జాగ్రత్తగా కశ్మీర్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపేశారు. ప్రజల కదలికలపై ఆంక్షలు విధించారు.

రియాజ్ నయికూ గత 8 ఏళ్లుగా భద్రతా దళల కళ్లుగప్పి తిరుగుతున్నాడు. నిషేధిత ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిద్దీన్ ఆపరేషనల్ కమాండర్, జమ్మూ కశ్మీర్ విభాగం చీఫ్‌గా అతడు పని చేశాడు. పోలీసులు, భద్రతా దళాలను గమనించగానే ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. అగ్రశ్రేణి ఉగ్రవాది ఒకరు చిక్కారని పోలీసులు ముందే వెల్లడించారు. కానీ అతడెవరనే వివరాలను తెలపలేదు.

హిజ్బుల్ చీఫ్ సయ్యిద్ సలహుద్దీన్‌కు నయికూ సన్నిహితుడని చెబుతారు. 2017లో అతణ్ని అమెరికా అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించింది. 2016 జులైలో బుర్హాన్ వనీ ఎన్‌కౌంటర్ తర్వాత నయికూ హిజ్బుల్ కశ్మీర్ కమాండర్ అయ్యాడు. టెక్నాలజీని అమితంగా ఇష్టపడే రియాజ్.. హిజ్బుల్ ముజాహిద్దీన్‌లో చేరక ముందే స్కూల్ విద్యార్థులకు ప్రయివేట్ ట్యూషన్లు ఇచ్చేవాడు. 2017లో జకీర్ ముసా హిజ్బుల్‌ను చీల్చి.. అన్సర్ ఘజ్వాతుల్ హింద్ పేరిట కొత్త గ్రూప్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇది అల్‌ఖైదాకు అనుబంధంగా పని చేస్తుంది. కాగా గత ఏడాది మే నెలలో ట్రాల్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో జకీర్ హతమయ్యాడు.

కశ్మీర్లో ఉగ్రవాదులు ఎవరైనా నాలుగేళ్లు పని చేయడమే గొప్ప విషయం. కానీ నయికూ 8 ఏళ్లకుపైగా కశ్మీర్లో ఉగ్రవాదిగా పని చేయడం గమనార్హం. గతంలోనూ భద్రతా సిబ్బంది చాలాసార్లు అతడిని కార్నర్ చేశాయి. కానీ ఎలాగోలా తప్పించుకొని పారిపోయాడు.

మంగళవారం రాత్రి 11 గంటలకు ఉగ్రవాదుల కోసం గాలింపు ప్రారంభం కాగా.. దాదాపు గంటన్నర తర్వాత ఉగ్రవాదులు దాగి ఉన్న ప్రాంతాన్ని గుర్తించారు. ఆటోమెటిక్ రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్న భద్రతా దళాలు.. 15 ఇళ్ల క్లస్టర్‌లో ఉగ్రవాదులు నక్కి ఉన్నారని గుర్తించారు.

కరోనా వైరస్‌పై భారత్ పోరాటం చేస్తుంటే.. పాకిస్థాన్ ఉగ్రవాదులను కశ్మీర్లోకి ఎగదోస్తున్న సంగతి తెలిసిందే. వారిని ఏరివేసే క్రమంలో గత నెలరోజుల్లో 22 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం కుప్వారాలో జరిగిన ఎన్‌కౌంటర్లో ఓ కల్నల్, మేజర్ సహా ఐదుగురు భద్రతా సిబ్బంది చనిపోయారు. సోమవారం ఇదే ప్రాంతంలో మరోసారి ఉగ్రవాదాదులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు భద్రతా సిబ్బంది మరణించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here