ప్రపంచవ్యాప్తంగా 2.58 లక్షలు దాటిన కరోనా మృతులు.. డిసెంబరునాటికే ఫ్రాన్స్‌లో వైరస్

మహమ్మారి ఉద్ధృతి ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతోంది. ఐరోపా దేశాలు సహా అమెరికాలోనూ విలయతాండవం చేస్తోంది. కొన్ని దేశాల్లో ఆంక్షలు సడలించడంతో మరోసారి వైరస్ విజృంభించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికా, ఇటలీ, స్పెయిన్, బ్రిటన్, ఫ్రాన్స్, నెదర్లాండ్‌లలో ప్రాణనష్టం భారీగా ఉంది. ఇప్పటి వరకూ ఐరోపాలోని ఇటలీలో అత్యధికంగా కరోనా మరణాలు చోటుచేసుకోగా.. ఆ సంఖ్యను బ్రిటన్ అధిగమించింది. అక్కడ మొత్తం కరోనా మరణాలు 29,427కి చేరాయి.

కాగా, ప్రపంచవ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,726,797 మంది వైరస్ బారినపడగా.. వీరిలో 258, 306 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 12.42 లక్షల మంది కోలుకోగా.. 21 లక్షల మందికిపైగా చికిత్స పొందుతున్నారు. వీరిలో 49 వేల మంది పరిస్థితి విషమంగా ఉంది.

ఇటలీలోనూ పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని, కరోనా కోరల నుంచి ఇంకా బయటపడలేదని ఆ దేశ ‘సుపీరియర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ అంటువ్యాధుల నిరోధక విభాగం అధిపతి జియోవన్ని రెజ్జా పేర్కొన్నారు. ఆంక్షలను సడలించినంత మాత్రాన తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని ప్రజలు భావించకూడదని అన్నారు. దేశంలో వైరస్‌ మళ్లీ బీభత్సం సృష్టించే ముప్పుందని చెప్పారు.

జర్మనీలో కరోనా రెండోసారి విజృంభణ అనివార్యమని జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం అధిపతి లొథర్‌ వీలర్‌ వ్యాఖ్యానించారు. ఎక్కువ మంది శాస్త్రవేత్తలు ఇదే విషయాన్ని చెబుతున్నారని తెలిపారు. రెండు దశలకు పరిమితం కాకుండా మూడో దశలోనూ వైరస్‌ విజృంభిస్తుందని మరికొంతమంది అంచనా వేస్తున్న సంగతిని గుర్తుచేశారు.

ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలోని పలు దేశాల్లో మహమ్మారి వ్యాప్తి కాస్త తగ్గుముఖం పట్టింది. వియత్నాం, థాయిలాండ్‌, తైవాన్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో రెండు రోజులుగా ఒక్క కేసూ బయటపడలేదు. గడచిన మూడు వారాలుగా చైనాలో ఒక్క కరోనా మరణం కూడా నమోదు కాలేదు. ఒక్క పాజిటివ్ కేసు నమోదు కావడంతో ప్రస్తుతం చైనాలో 400 మంది కొవిడ్‌ బాధితులు చికిత్స పొందుతున్నారు. దక్షిణ కొరియాలో కేవలం మూడు కేసులే నమోదు కాగా.. ఫిబ్రవరి 18 తర్వాత ఇంత తక్కువ సంఖ్యలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.

ఆంక్షల సడలింపుపై విమర్శలు వెల్లువెత్తుతుండటంతో.. అమెరికాలోని పలు రాష్ట్రాలు ఆంక్షల ఎత్తివేత ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేశాయి. న్యూయార్క్‌లోని నర్సింగ్‌ హోంలు, వృద్ధాశ్రమాల్లో మార్చి 1 తర్వాత 4,813 మంది కరోనా బారిన పడి మృతిచెందారని అధికారవర్గాలు వెల్లడించాయి. గతంలో ఈ లెక్కల్లో చూపని 1,700కుపైగా మరణాలను ప్రస్తుతం కలపడం గమనార్హం. రోజువారీ నమోదయ్యే పాజిటివ్ సంఖ్య వచ్చే నెల 1 నాటికి రెండు లక్షలకు, మరణాల సంఖ్య మూడు వేలకు పెరుగుతాయని అంచనా అమెరికా అంతర్గత నివేదిక ఒకటి అంచనా వేసింది. అమెరికాలో ఇప్పటికే 12.32 లక్షల మందికిపైగా వైరస్‌ బారిన పడగా.. 72వేల మందికిపైగా మరణించారు.

ఫ్రాన్స్‌లో డిసెంబరులోనే కరోనా కేసు బయటపడినట్లు తాజా అధ్యయనంలో శాస్త్రవేత్తలు గుర్తించారు. గల్ఫ్‌ దేశాల్లో 10 వేలమందికిపైగా భారతీయులకు కరోనా సోకిందని, వారిలో 84 మంది మరణించారని తెలుస్తోంది. ఇటలీలో 29,315, స్పెయిన్‌లో 25,615, ఫ్రాన్స్‌లో 25,531, బెల్జియంలో 8,0160, జర్మనీలో 6,997 మంది కరోనా కాటుకు బలయ్యారు. ఈ దేశాల్లో బాధితుల సంఖ్య కూడా లక్షల్లోనే ఉంది.

స్పెయిన్‌లో 250,560, ఇటలీలో 213,613, ఫ్రాన్స్‌లో 170,551, జర్మనీలో 167,007, బ్రిటన్ 194,990, టర్కీలో 129,490, బెల్జియం 50,509 మంది వైరస్ బారినపడ్డారు. రష్యాలోనూ మమహ్మారి తీవ్రత రోజు రోజుకూ పెరుగుతోంది. అక్కడ ఇప్పటి వరకూ 155,370 వేలకుపైగా కేసులు నిర్ధారణ కాగా.. మరణాల సంఖ్య మాత్రం 1,450గా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here