ప్రధాని మోదీకి యూఏఈ అత్యవసర సందేశం.. కరోనా వేళ సాయం కోసం రిక్వెస్ట్

కరోనా కేసులు పెరుగుతున్న వేళ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ () భారత్ సాయం కోరింది. కరోనా పేషెంట్లకు చికిత్స అందించడం కోసం తమ దేశానికి డాక్టర్లు, నర్సులను పంపించాలని కోరింది. కోటి లోపు జనాభా ఉన్న యూఏఈలో ఇప్పటికే 11 వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. సగటున రోజుకు 500 కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. ఈ దేశంలోని హాస్పిటళ్లలో పని చేసే డాక్టర్లు, పారామెడికల్ సిబ్బందిలో భారతీయులు, ఇతర దేశాలకు చెందిన వారే ఎక్కువగా ఉంటారు.

కోవిడ్ కట్టడి కోసం భారత్, అబుదాబీ మధ్య విమానాల రాకపోకలను రద్దు చేయడంతో నిలిపేయడంతో… యూఏఈలో పని చేస్తూ స్వదేశానికి వచ్చిన డాక్టర్లు ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. విమానాలు రద్దు కావడంతో భారత్‌లోనే ఉండిపోయిన వైద్య సిబ్బంది విధుల్లో చేరడానికి వీలుగా వారిని తమ దేశానికి పంపాలని యూఏఈ కోరిందని ప్రభుత్వాధికారి ఒకరు తెలిపారు. వీరిని యూఏఈ తీసుకెళ్లడం కోసం అబుదాబీ నుంచి ప్రత్యేక విమానాన్ని పంపిస్తామని కూడా ఆ దేశం భారత్‌కు తెలిపింది.

రెండో రిక్వెస్ట్‌గా.. కరోనా సంక్షోభం నుంచి గట్టెక్కడం కోసం స్వల్ప కాలానికి డాక్టర్లు, నర్సులను భారత్ నుంచి నియమించుకోవడానికి అనుమతి ఇవ్వాలని కూడా యూఏఈ ప్రభుత్వం మోదీ సర్కారును కోరింది.

భారత్, యూఏఈ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. దీంతో అబుదాబీ మొదటి అభ్యర్థనకు మోదీ సర్కారు వెంటనే సానుకూలంగా స్పందించే అవకాశం ఉంది. ఇక కొత్తగా డాక్టర్లు, నర్సును నియమించుకునే విషయంలో ఇరు దేశాల ప్రభుత్వాల మధ్య చర్చలు అవసరమయ్యే అవకాశం ఉంది. భారత్ అవసరాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఓ నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. కరోనా నేపథ్యంలో పాకిస్థాన్ సహా అనేక దేశాల కార్మికులను యూఏఈ స్వదేశాలకు పంపించింది. కానీ భారతీయులకు మాత్రం మినహాయింపు ఇచ్చింది. ఆహారం, నిత్యావసరాలను నిరంతరాయంగా సరఫరా చేస్తామని గల్ఫ్ దేశాలకు భారత్ హామీ ఇవ్వడమే దీనికి కారణం.

రెండు వారాల క్రితమే భారత్ 15 మంది మిలటరీ డాక్టర్లు, పారామెడిక్స్‌తో కూడిన బృందాన్ని కువైట్‌కు పంపింది. అవసరమైతే మరింత మందిని పంపిస్తామని హామీ ఇచ్చింది. మోదీ అధికారంలోకి వచ్చాక గల్ఫ్ దేశాలతో సంబంధాలను బలోపేతం చేయడంపై ఫోకస్ పెట్టారు. సౌదీ అరేబియా, యూఏఈ, జోర్డాన్, బహ్రెయిన్, ఖతార్, ఒమన్‌లపై దౌత్యపరంగా ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ఈ దేశాల్లో 12.6 మిలియన్ల భారతీయులు పని చేస్తుండగా.. యూఏఈలోనే దాదాపు 34 లక్షల మంది భారతీయ కార్మికులు పని చేస్తున్నారు. 2015లో ప్రధాని మోదీ ఆ దేశాన్ని సందర్శించారు. గత మూడు దశాబ్దాల్లో యూఏఈలో అడుగుపెట్టిన తొలి భారత ప్రధాని మోదీ కావడం గమనార్హం. గత ఏడాది యూఏఈ ప్రభుత్వం అత్యున్నత పౌరపురస్కారమైన ‘ఆర్డర్ ఆఫ్ జాయెద్‌’తో ప్రధాని మోదీని గౌరవించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here