పెళ్లి డేట్ ఫిక్స్ చేసేలోపే ప్రేమజంట ఆత్మహత్య.. ఆసిఫాబాద్‌లో విషాదం

ప్రేమపెళ్లికి అందరినీ ఒప్పించారు. నిశ్చితార్థం, పెళ్లి తేదీలే ఖరారు కావాల్సి ఉంది. ఇలాంటి సమయంలో అనూహ్యంగా ఆ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. ఊహించని ఘటనతో ఇరుకుటుంబాలు తల్లడిల్లిపోతున్నాయి. పెళ్లి జరగదన్న భయంతోనే ఆత్మహత్య చేసుకుని ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషాద ఘటన ఆసిఫాబాద్‌ జిల్లాలో చోటుచేసుకుంది.

ప్రేమజంట పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆసిఫాబాద్ జిల్లా ఖంపూర్ గ్రామంలో జరిగింది. ఖంపూర్ గ్రామానికి చెందిన సోయం సీతాబాయి(20), ఉట్నూరు మండలం కన్నాపూర్‌కి చెందిన గణేష్(22) కొద్దికాలంగా ప్రేమించుకుంటున్నారు. ఆ విషయం ఇద్దరి ఇళ్లలో తెలియడంతో జంటకు పెళ్లి చేయాలని నిర్ణయించారు. నిశ్చితార్థం, పెళ్లి తేదీలు ఖరారు చేద్దామని ఇరుకుటుంబాల పెద్దలు మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది.

Also Read:

ప్రియుడు గణేష్ కొద్దికాలంగా ప్రియురాలి స్వగ్రామం ఖంపూర్‌లోనే ఉంటున్నాడు. పొలంలో కలుసుకున్న ప్రేమికులు అమ్మాయి సోదరుడికి ఫోన్ చేసి తాము ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పారు. అనంతరం పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. పొలంలోనే ప్రాణాలు విడిచారు. అమ్మాయి సోదరుడు అక్కడికి వెళ్లే సరికి ఇద్దరూ విగతజీవులుగా కనిపించారు.

అయితే ప్రేమ పెళ్లికి అందరి నుంచి అంగీకారం వచ్చిన తరువాత చేసుకోవడం మిస్టరీగా మారింది. లాక్‌డౌన్ ఎప్పటికి ముగుస్తుందో.. అసలు తమ పెళ్లి జరుగుతుందో? లేదోనన్న మనస్థాపంతో ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Read Also:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here