పడిపోయిన డబ్బులు.. కరోనా భయంతో ముట్టని జనం, కాపాడిన ఫేక్ న్యూస్

రో డ్డుపై కరెన్సీ కట్ట పడిపోతే ఏమవుతుంది? ‘డబ్బులు పడిపోయాయ్’ అని అరిచినంత సేపట్లో మాయమవుతాయి. కానీ, ఇది కరోనా కాలం. చరిత్రలో ఎప్పుడూ చూడని వింతలకు ఈ మహమ్మారి కారణమవుతోంది. బిహార్‌లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఓ ఆటో డ్రైవర్ పొరపాటున రూ.20,500 విలువైన కరెన్సీనీ రోడ్డుపై పారేసుకుంటే.. కరోనా అంటించడానికి ఎవరో కావాలని చేశారంటూ వాటిని ముట్టుకోవడానికి ఎవరూ సాహసం చేయలేదు. విచిత్రంగా ఈసారి ఓ ఫేక్ వార్త అతడికి తాను పోగుట్టుకున్న సొమ్మును తిరిగి పొందేలా చేయడం మరో విశేషం.

సహర్సా జిల్లా కోపా గ్రామానికి చెందిన గజేంద్ర షా (29) ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. శనివారం (మే 2) వేకువజామున ఐదున్నర గంటలకే అతడు తన ఆటో రిక్షా తీసుకొని టిన్‌-షెడ్‌ కొనేందుకు రూ.25 వేలు తీసుకుని స్థానిక మహువా బజార్‌కు బయల్దేరాడు. మార్కెట్‌‌కు చేరుకోగానే తన జేబులో నుంచి అప్పటికే రూ.20,500 కరెన్సీ పోయినట్టు గుర్తించాడు.

Don’t Miss:

గజేంద్ర తన ఆటో నడుపుతూ మార్గమధ్యంలో జేబులో నుంచి గుట్కా ప్యాకెట్‌ తీసి వేసుకున్నాడు. ఆ సమయంలో జేబులో నుంచి కరెన్సీ నోట్లు కిందపడిపోయినట్లు భావించాడు. వెంటనే ఆ కరెన్సీ నోట్లను వెతుక్కుంటూ తిరిగి వెనక్కి వచ్చాడు. కానీ, గుట్కా వేసుకుంది ఎక్కడో గుర్తు రాలేదు. కొన్ని కిలోమీటర్ల దూరం వరకు వెనక్కి నడిచి వెళ్లి చూసినా ఫలితం లేకుండా పోయింది. బాధతో ఇంటికి తిరిగి వెళ్లిపోయాడు.

రెండు నెలలు రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదించిన సొమ్ము క్షణాల్లో పోయిందని గజేంద్ర షా దిగులు చెందుతూ ఇంటికి చేరుకున్నాడు. అతడు బాధ పడుతుండటం చూసి ఏమైందని పొరుగింటి వ్యక్తి ఆరా తీశాడు. కరెన్సీ కట్ట రోడ్డుపై పడిపోయిందని ఆవేదనగా చెప్పాడు. అప్పుడు పొరుగింటి వ్యక్తి చెప్పిన సమాధానం గజేంద్రలో ఆశలు రేపాయి.

ఉడాకిషన్‌గంజ్‌ ప్రాంతంలో ఎవరో కరోనా వ్యాప్తి చేయడానికి రోడ్డుపై కావాలని కరెన్సీ కట్టలు వేశారంటూ ఫేస్‌బుక్‌లో ఓ పోస్టు చేశారంటూ గజేంద్రకు పొరుగింటి వ్యక్తి చూపెట్టాడు. టిక్ టాక్‌లోనూ అందుకు సంబంధించి ఓ వీడియో తీసి పోస్టు చేశారు. ఆ కరెన్సీ నోట్లను ఎవరూ తాకకుండా పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వచ్చి స్వాధీనం చేసుకున్నట్లు ఆ ఫేస్‌బుక్ పోస్టులో రాసుకొచ్చారు. గజేంద్ర దాన్ని చూసిన వెంటనే పరుగు పరుగున ఉడాకిషన్‌గంజ్‌ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాడు.

Must Read:

గజేంద్ర చెప్పిన వివరాలను పరిశీలించిన పోలీసులు అతడి సొమ్ములేనని నిర్ధారించుకున్న తర్వాత అతడికి అప్పగించారు. అతడితో ఓ పత్రంపై సంతకం కూడా చేయించుకున్నారు. ‘రోడ్డుపై డబ్బులు పడి ఉన్నాయని.. కరోనా వైరస్‌ను వ్యాప్తి చేసేందుకు కావాలనే ఎవరో నగదు పడేశారని మాకు చాలా మంది ఫోన్‌ చేశారు. ఘటనా స్థలానికి వెళ్లి నగదు స్వాధీనం చేసుకున్నాం. ఆ డబ్బు తనదేనంటూ గజేంద్ర రావడంతో వివరాలు కనుక్కుని అతడికి ఇచ్చేశాం’ అని ఉడాకిషన్‌గంజ్‌ పోలీసులు తెలిపారు.

సోషల్‌ మీడియాలో క్షణాల్లో వైరల్ అయిన ఓ ఫేక్ వార్త కారణంగా గజేంద్ర డబ్బులు అతడికి మళ్లీ దక్కాయి. ఓ వ్యక్తి కరెన్సీ నోటుతో ముక్కు తుడుచుకున్న టిక్‌ టాక్‌ వీడియోను తాను కూడా చూశానని గజేంద్ర తెలిపాడు. ఎవరూ లేని దారిలో డబ్బు కనపడితే తాను కూడా తీసుకునేవాడిని కాదని చెప్పాడు. ఈ ఘటన తర్వాత గుట్కా నమిలే అలవాటును మానేయాలని అనుకుంటున్నట్లు గజేంద్ర చెప్పడం కొసమెరుపు.

Photo Credit: India Today

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here