పంజాబ్‌లో కుప్పకూలిన మిగ్-29 యుద్ధ విమానం

భారత వాయుసేనకు చెందిన మిగ్‌-29 శిక్షణ యుద్ధ విమానం శుక్రవారం ఉదయం పంజాబ్‌లోని జలంధర్ సమీపంలో కూలిపోయింది. ఈ ప్రమాదం నుంచి పైలట్‌ క్షేమంగా బయటపడ్డారని అధికారులు తెలిపారు. రోజువారీ శిక్షణలో భాగంగా బయలుదేరిన ఈ విమానం టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే నవాన్‌షేహర్ జిల్లా రూర్కీ కలాన్ గ్రామం వద్ద కుప్పకూలింది. సాంకేతిక లోపం తలెత్తడంతో విమానంపై పైలట్ నియంత్రణ కోల్పోయాడని తెలిపారు. నిర్జన ప్రదేశంలో విమానం కూలిపోయిందని, పైలట సురక్షితంగా బయటపడ్డారని ఐఏఎఫ్ తెలిపింది.

ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని, ఘటనపై న్యాయ విచారణ ఆదేశించామని వెల్లడించింది. ప్రమాదంలో స్వల్పంగా గాయపడిన పైలట్‌ను చికిత్స కోసం హాస్పిటల్‌లో చేర్పించినట్టు హోషియార్‌పూర్ పోలీస్ అధికారి గౌరవ్ గార్గ్ వెల్లడించారు.

కాగా, వాయుసేనకు చెందిన మిగ్-17 మధ్యతరహా రవాణా హెలికాప్టర్ గురువారం సిక్కిమ్‌లోని ముకుతాంగ్‌లో అత్యవసరంగా ల్యాండింగ్ అయ్యింది. వాతావరణం అనుకూలించకపోవడంతో అత్యవసరంగా ల్యాండిగ్ అయ్యిందని, అందులోని ఆరుగురు సురక్షితంగా బయటపడినట్టు తెలిపింది. వీరిలో నలుగురు ఐఏఎఫ్ సిబ్బంది కాగా.. ఇద్దరు ఆర్మీ ఉద్యోగులు.

తరచూ మిగ్ 29 విమానాలు ప్రమాదానికి గురవుతున్నాయి. రెండు వారాల కిందట ఇండియన్ నేవీకి చెందిన మిగ్-29కే శిక్షణ విమానం గోవాలో కూలిపోయింది. ఈ ప్రమాదంలోనూ పైలట్ సురక్షితంగా బయటపడ్డారు. గత నవంబరులోనూ ఇదే రకానికి చెందిన విమానం కూలిపోయింది. ఈ ఘటనలో అందులో ఉన్న ఇద్దరు పైలెట్లు ప్రాణాలతో బయటపడ్డారు. అప్పుడు పక్షులు అడ్డురావడంతో ఇంజిన్ మొరాయించి ప్రమాదం సంభవించింది. అయితే పైలట్ల చాకచక్యంతో జనావాసాల్లో పడకుండా జాగ్రత్తపడ్డారు. వారు కూడా వెంటనే బయటకు దూకి ప్రాణాలు రక్షించుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here