న్యూయార్క్‌లో మరో మాయ రోగం.. 100 మంది పిల్లలకు అస్వస్థత, ఐదుగురి మృతి

ప్ర పంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తున్న వేళ మరో మాయ రోగం కలకలం రేపుతోంది. క‌రోనా కరాళనృత్యం చేస్తున్న అగ్రరాజ్యం అమెరికాలో ఇది అలజడి సృష్టిస్తోంది. ముఖ్యంగా ఐదేళ్ల లోపు చిన్నారులు దీని బారినపడుతున్నారు. కరోనా బారినపడి కోలుకున్న వారిలో ఈ కొత్త వ్యాధి లక్షణాలు బయటపడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కరోనా నుంచి కోలుకున్న పలువురు పిల్లల్లో ఆరు వారాల తర్వాత ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయి.

పీడియాట్రిక్ మల్టీ సిస్టమ్ ఇన్‌ఫ్లేమేటరీ సిండ్రోమ్‌గా పేర్కొంటున్న ఈ మాయ రోగం కారణంగా న్యూయార్క్‌లో ఇప్పటికే ఐదుగురు చిన్నారులు మరణించారు. బుధవారం (మే 13) నాటికి 100 మంది చిన్నారులు ఈ వ్యాధి లక్షణాలతో అస్వస్థతకు గురై వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 20 ఏళ్ల లోపు వారిలోనూ కొంత మందిలో ఈ వ్యాధి లక్షణాలు గుర్తించినట్లు తెలుస్తోంది.

ఈ వ్యాధి ల‌క్షణాలు క‌వాసాకీ డిసీజ్ లేదా టాక్సిక్ షాక్ ల‌క్షణాలను పోలి ఉన్నాయ‌ని వైద్యులు చెబుతున్నారు.‌ చిన్నారుల్లో జ్వరం, నీర‌సం, ఆక‌లి లేక‌పోవ‌డం, వికారం, వాంతులు లాంటి లక్షణాలు కనిపిస్తు్న్నాయి. పిల్లల్లో ఇలాంటి లక్షణాలు క‌నిపిస్తే వీలైనంత త్వరగా ఆస్పత్రికి తీసుకురావాల‌ని వైద్యులు సూచించారు. ప‌రిస్థితి విష‌మిస్తే పిల్లలు మరణించే ప్రమాదం ఉంద‌ని హెచ్చరిస్తున్నారు. అంతుచిక్కని ఈ వ్యాధిపై న్యూయార్క్‌లో పరిశోధనలు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here