ధరలు పెరిగినా మందుబాబుల్లో తగ్గని జోష్.. అన్ని రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి!

దేశంలో కట్టడికి విధించిన మూడో దశ లాక్‌డౌన్ మే 17 వరకు కొనసాగనుండగా.. ఈ సమయంలో మద్యం అమ్మకాలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో దేశవ్యాప్తంగా సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. దాదాపు 42 రోజుల పాటు మద్యానికి దూరంగా ఉన్న మందుబాబుల్లో ఉత్సాహం ఉరకలెత్తుతోంది. భౌతికదూరం పాటించాలన్న నిబంధనను అటకెక్కించి, వైన్ షాపులకు పోటెత్తారు. కిలోమీటర్ల మేర క్యూలైన్‌లో నిలబడి ఉన్న దృశ్యాలు సోషల్ మీడియా, ప్రసార మాధ్యమాల్లో దర్శనమిస్తున్నాయి.

మందుబాబుల దెబ్బకు ముంబైలో మద్యం దుకాణాలను అధికారులు మూసివేశారు. నగరంలో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో జనం గుమిగూడి ఉంటే మరింత ప్రమాదకరంగా మారుతుందని భావించి వైన్ షాపులను తెరవద్దని ఆదేశించారు. సోమవారం దేశవ్యాప్తంగా మద్యం అమ్మకాల వల్ల రూ.1,000 కోట్ల ఆదాయం సమకూరింది. అన్ని రాష్ట్రాల్లోనూ ఆరు నుంచి ఏడు రెట్ల మేర అమ్మకాలు పెరిగాయి. ఆదాయం కూడా పెద్ద మొత్తంలోనే సమకూరింది. మహారాష్ట్రలో గురువారం రూ.62 కోట్ల మేర అమ్మకాలు జరిగాయి. అటు ఏపీలో తొలి రోజే మద్యం అమ్మకాలు రికార్డు సృష్టించాయి. సోమవారం ఏపీలో రూ. 68.7 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ అధికారికంగా ప్రకటించింది.

మద్యం ధరలు 25 శాతం పెంచి అమ్మిన తర్వాత కూడా ఈ స్థాయిలో అమ్మకాలు జరిగడం విశేషం. మందుబాబులు లిక్కర్ షాపుల మందు భారీగా ఎగబడుతుండటంతో మంగళవారం మరో 50 శాతం ధరలు పెంచుతున్నట్లు జగన్ సర్కారు ప్రకటించింది. అంటే ఒక్కరోజు వ్యవధిలోనే ఏపీలో మద్యం ధరలు 75 శాతం పెరిగాయి. మద్యం ధరలు పెరిగినా మందుబాబుల తాకిడి మాత్రం తగ్గకపోవడం విశేషం.

కర్ణాటకలోనూ మద్యం విక్రయాల్లో కొత్త రికార్డులు నమోదవుతున్నాయ. సోమవారం రూ.45 కోట్ల మద్యం అమ్మకాలు జరిగితే.. మంగళవారం ఏకంగా రూ.197 కోట్ల మద్యం అమ్ముడయ్యింది. దీంతో గతేడాది డిసెంబరు 28న నమోదయిన రూ.170 కోట్ల మద్యం అమ్మకం రికార్డు కనుమరుగయ్యింది. మద్యం ప్రధాన ఆదాయ వనరు కావడంతో ప్రభుత్వాలు దీనిని సొమ్ము చేసుకోవాలని భావిస్తున్నాయి. కర్ణాటక ప్రభుత్వం కూడా 11 శాతం మేర ధరలు పెంచింది. స్పెషల్ కోవిడ్ ట్యాక్స్ కింద మద్యం ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇవి బుధవారం నుంచే అమల్లోకి వచ్చాయి. లాక్‌డౌన్ కారణంగా మద్యం విక్రయాల నిలిచిపోవడంతో రూ.2,600 కోట్ల ఆదాయానికి గండిపడిందని కర్ణాటక వెల్లడించింది.

పశ్చిమ్ బెంగాల్‌లో తొలిరోజు రూ.40 కోట్లు రాగా.. మంగళవారం దీనికి రెట్టింపు ఆదాయం సమకూరింది. ఉత్తరప్రదేశ్‌లోనూ సోమవారం రూ.100 కోట్లు రాగా.. మంగళవారం కూడా దీనికి మించి వచ్చినట్టు తెలుస్తోంది. ఢిల్లీ ప్రభుత్వం కూడా మద్యం ధరలను 70 శాతం మేర పెంచింది. అయినా సరే మందుబాబులు ఏ మాత్రం వెనుకాడటంలేదు. దుకాణాలు ముందు కిలోమీటర్ల కొద్ది క్యూలో నిలబడి ఉన్నారు. తూర్పు ఢిల్లీలో ఒకానొక దశలో పోలీసులు లాఠీఛార్జ్ చేసే పరిస్థితి ఎదురయ్యింది. ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా క్యూలైన్‌లో నిలబడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

హర్యానాలో బుధవారం నుంచి మద్యం అమ్మకాలు ప్రారంభమయ్యాయి. ఈ రాష్ట్రంలోనూ మద్యం ధరలు స్వల్పంగా పెరిగాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా మద్యం ధరలను 16 శాతం వరకు పెంచింది. పేదలు ఎక్కువగా తాగే చీప్ లిక్కర్ ధరలను 11 శాతం పెంచిన ప్రభుత్వం.. మిగతా బ్రాండ్లపై 16 శాతం వరకూ ధరలను పెంచి బుధవారం నుంచి అమ్మకాలు ప్రారంభించింది. మద్యం అమ్మకాలు ద్వారా మే నెలలో రూ.325 కోట్ల ఆదాయార్జనే లక్ష్యంగా పెట్టుకుంది. ఉదయం నుంచి మద్యం ప్రియులు షాపుల వద్దకు చేరుకుని పడిగాపులు కాస్తున్నారు. కొన్ని చోట్ల మహిళలు కూడా క్యూలో నిలబడటం విశేషం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here