దేశంలో 60వేలకు చేరువలో కరోనా కేసులు.. అల్లాడుతున్న ఐదు రాష్ట్రాలు

భారత్‌లో మహమ్మారి తీవ్రత పెరుగుతోంది. లాక్‌డౌన్ కొనసాగుతున్నా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. పాజిటివ్ కేసుల రెట్టింపునకు పట్టే సమయం పెరిగినట్టే పెరిగి మళ్లీ తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. వారం రోజుల కిందటి వరకు 12 రోజులుగా ఉన్న డబ్లింగ్‌ రేటు, ప్రస్తుతం పది రోజులకు పడిపోయింది. గడచిన ఐదు రోజుల నుంచి దేశవ్యాప్తంగా రోజుకు సగటున 3 వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటి వరకూ నమోదైన కేసుల్లో 64.68% పది రాష్ట్రాల్లోని 15 జిల్లాల్లోనే ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 60వేలకు చేరువలో ఉంది. వీరిలో 1,985 మంది ప్రాణాలు కోల్పోగా.. 17,887 మంది కోలుకున్నారు.

కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వివరాల ప్రకారం… దేశంలో వైరస్‌ నుంచి కోలుకున్నవారి రేటు శుక్రవారం నాటికి 29.35 శాతానికి చేరింది. 24 గంటల్లో చోటుచేసుకున్న మరణాల్లో 69.90 శాతం మహారాష్ట్ర, గుజరాత్‌లోనే సంభవించాయి. పాజిటివ్ కేసులు కూడా ఈ రెండు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో నిర్ధారణ అవుతున్నాయి. అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో వైరస్‌ బారినపడ్డ మొత్తం 33 మంది కోలుకున్నారు. ఇక, కేరళలో 503 మందికి వైరస్ సోకగా 474 మంది (94.23%) కోలుకోగా, కేవలం 29 మంది మాత్రమే హాస్పిటల్‌లో ఉన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో త్రిపురలోనే వైరస్‌ ఉద్ధృతి ఎక్కువగా ఉంది. అక్కడ కొత్తగా 22 కేసులు నమోదయ్యాయి.

దేశంలోని పది రాష్ట్రాల్లోని 15 జిల్లాలో కరోనా ఉద్ధృతి ఎక్కువగా ఉంది. ఈ జాబితాలో నగరాలే ఎక్కువ. వ్యాపార, వాణిజ్య, పర్యాటక కార్యకలాపాలు, జన సాంద్రత ఎక్కువగా ఉండటం వల్లే ఇక్కడ వైరస్‌ ఉద్ధృతి ఎక్కువగా ఉంటోంది. ముంబయి, ఢిల్లీలు అత్యధిక కొవిడ్‌-19 కేసులతో తొలి రెండు స్థానాల్లో నిలిచాయి.

నిన్నటి దాకా తక్కువ కేసులు నమోదైన ఒడిశాలో ఒక్కసారిగా మహమ్మారి తీవ్రత పెరిగింది. శుక్రవారం ఒక్క రోజే 51 మందికి వైరస్‌ సోకినట్లు నిర్ధారణ కావడంతో రాష్ట్రం ఉలిక్కిపడింది. వీరిలో 50 మంది గుజరాత్‌లోని సూరత్‌ నుంచి, మరొకరు కేరళ నుంచి వచ్చిన వారే. రాష్ట్రంలో మొత్తం 219 మంది కరోనా వైరస్‌ బారిన పడ్డారు.

కరోనా మహమ్మారి మహారాష్ట్రకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. శుక్రవారం ఒక్కరోజే 1,089 కొత్త కేసులు నమోదు కాగా, 784 కేసులు ముంబయిలోనే ఉన్నాయి. గత 24 గంటల్లో 37 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడ పాజిటివ్ కేసుల సంఖ్య 19వేలు దాటింది. మొత్తం 731 మంది ప్రాణాలు కోల్పోయారు.

గుజరాత్‌లో గత 24గంటల్లో 390 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. మకొ 24 మంది మృతి చెందారు. రాష్ట్రంలో మొత్తం 7,012 కేసులు నమోదుకాగా మరణాల సంఖ్య 425కి చేరింది. ఢిల్లీలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. మొత్తం పాజిటివ్ కేసులు 6,318కి చేరాయి. తమిళనాడులో శుక్రవారం ఏకంగా 600 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,000 దాటింది. రాజస్థాన్‌లో 3,579 మంది, మధ్యప్రదేశ్‌లో 3,341 మంది, ఉత్తరప్రదేశ్ 3,214 మంది, ఆంధ్రప్రదేశ్‌లో 1,887 మంది, పంజాబ్‌లో 1,731 మంది, పశ్చిమ్ బెంగాల్ 1,678 మంది తెలంగాణలో 1,132 మంది వైరస్ బారినపడ్డారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here