దారుణం… శివాలయంలో ఇద్దరు సాధువుల హత్య

ఓ వైపు దేశ వ్యాప్తంగా కరోనాతో యుద్ధం సాగుతుంటే… మరోవైపు శివాలయంలో సాధువుల హత్యలు కలకలం రేపుతున్నాయి. తాజాగా ఇద్దరు సాధువులు అనుమానాస్పదంగా మృతి చెందరాు. ఈ ఘటన ఉత్తర్‌ ప్రదేశ్‌ బులంద్‌షహర్‌లో జరిగింది. మొన్న పాల్ ఘర్ ఘటన మరువకముందే.. మంగళవారం తెల్లవారుజామున యూపీలో మరో దారుణం చోటుచేసుకుంది. బులంధర్‌లోని ఓ ఆలయంలో ఇద్దరు సాధువులను గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చారు. మృతదేహాలు రక్తపు మడుగులో పడి ఉన్నాయి. దీంతో వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

మృతిచెందిన ఇద్దరు సాధువులు 55 ఏళ్ల జగదీష్ అలియాస్ రంగి దాస్‌గా, మరో సాధువు 45 ఏళ్ల షేర్ సింగ్ అలియాస్ శివ దాస్‌గా గుర్తించారు. వీరిద్దరూ శివాలయంలో పురోహితులుగా పనిచేస్తు ఆలయ పరిసర ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరా ప్రకారం హత్య చేసిన నిందితులు పదునైన ఆయుధాలు ఉపయోగించినట్లు గుర్తించారు. అలాగే ఈ హత్యలకు సంబంధించి ప్రధాన నిందితుడిగా భావిస్తున్నపక్క గ్రామానికి చెందిన మురళి అలియాస్ రాజు అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే రాజుకు రెండు రోజుల క్రితం సాధువులతో చిన్నపాటి ఘర్షణ తలెత్తినట్లు సమాచారం. సాధువులకు సంబంధించిన కొన్ని వస్తువుల్ని రాజు దొంగలించేందుకు ప్రయత్నించడంతో వీరి మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఆ కక్షతోనే మంగళవారం ఉదయ మత్తుమందు ఉపయోగించి పదునైన కత్తితో సాధువులను రాజు హత్య చేసినట్లు సమాచారం.

మంగళవారం ఉదయం రాజు తన చేతిలో పదునైన కత్తితో గ్రామం నుంచి వెళ్తున్నట్లు పలువురు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అయితే పోలీసులు అరెస్ట్ చేసిన సమయంలో కూడా నిందితుడు రాజు స్పృహలో లేడని పోలీసులు చెబుతున్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సాధువుల మృత దేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా సాధువుల హత్యతో గ్రామస్థులు ఆగ్రహాం వ్యక్తం చేశారు. అదనపు బలగాలతో పరిస్థితిని అదుపు చేస్తున్నారు పోలీసులు. మరోవైపు ఈ ఘటనపై స్పందించిన సీఎం యోగి ఆదిత్యనాథ్ లోతైన విచారణ చేపట్టాలని అధికారుల్ని ఆదేశించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here