తెలంగాణలో పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్య.. వైరల్‌గా మారిన సూసైడ్ నోట్

మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో జూనియర్‌ పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్య తీవ్ర కలకలం రేపింది. మహబూబ్‌నగర్‌లోని మర్లు ప్రాంతానికి చెందిన ఈదుల అరుణ్‌చంద్ర (24) హన్వాడ మండలం యారోనిపల్లిలో జూనియర్‌ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాడు. బుధవారం రాత్రి ఇంటి మేడపై పడుకున్న అరుణ్ గురువారం తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో కిందకు దిగి ఇంట్లోకి వెళ్లాడు. ఉదయం ఏడు గంటల సమయంలో కుటుంబసభ్యులు గదిలోకి వెళ్లి చూడగా అరుణ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించాడు. దీంతో వారు వెంటనే కిందికి దించి ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు.

Also Read:

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు. కుటుంబసభ్యులతో పాటు స్థానికులను ప్రశ్నించి వివరాలు సేకరించారు. తమ కుమారుడి ఆత్మహత్యకు యారోనిపల్లి సర్పంచి సుధారాణి, ఆమె భర్త అనంతరెడ్డి, వార్డు సభ్యుడు తిరుపతయ్య కారణమని మృతుడి తండ్రి వెంకటేశ్వర్‌రావు పోలీసులకు ఫిర్యాదు చేశాడే. రిజర్వేషన్‌లో ఉద్యోగం సాధించి తమ ముందు విర్రవీగుతున్నావంటూ నోటికొచ్చినట్లు మాట్లాడటంతో పాటు విధులకు ఆటంకం కలిగించడంతో అరుణ్ మనస్తాపానికి గురయ్యాడని, అందువల్లే ఆరు రోజులుగా విధులకు హాజరు కాలేదని ఆయన చెప్పాడు.

Also Read:

తన కొడుకును వేధించి ఆత్మహత్యకు కారకులైన సుధారాణి, అనంతరెడ్డి, తిరుపతయ్యలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని వెంకటేశ్వర్‌రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై సర్పంచి సుధారాణి, ఆమె భర్త అనంతరెడ్డి స్పందిస్తూ… అరుణ్‌చంద్ర ఏప్రిల్‌ 24 నుంచి విధులకు రావడం లేదని, ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ రావడంతో మే 1న ఎంపీవోకు ఫిర్యాదు చేశామన్నారు. మే 2వ తేదీన పంచాయతీ కార్యాలయంలోని ఫైళ్లలో సూసైడ్ నోట్ కనిపించగా ఎంపీడీవోకు, ఆయన కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. అరుణ్ ఆత్మహత్యకు తమకు సంబంధం లేదని స్పష్టం చేశారు. మరోవైపు తల్లిదండ్రులతో పాటు స్నేహితులకు క్షమాపణ చెబుతూ తన చావుకు ఎవరూ కారణం కాదని పేర్కొంటూ అరుణ్ రాసిన సూసైడ్ నోట్ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. పని ఒత్తిడి కాణంగా ఆత్మహత్య చేసుకుంటున్నట్లు అరుణ్ నోట్‌లో పేర్కొన్నాడని, దాని ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here