ఢిల్లీ: ఒకే బెటాలియన్‌లోని 122 మంది సీఆర్పీఎఫ్ జవాన్లకు కరోనా

ఢిల్లీలోని సీఆర్‌పీఎఫ్‌ 31వ బెటాలియన్‌లో ఇప్పటి వరకు 122 మందికి కరోనా వైరస్‌ సోకినట్లు అధికారులు వెల్లడించారు. మరో 100 మందికి సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉందని తెలిపారు. గత కొద్ది రోజులుగా మహమ్మారి విజృంభించడంతో వారు ఉంటున్న మయూర్‌ విహార్‌ ఫేజ్‌-3 ప్రాంతాన్ని ఇప్పటికే పూర్తిగా నిర్బంధంలో ఉంచారు. పాజిటివ్‌‌గా నిర్ధారణ అయిన చాలా మందిలో వైరస్ లక్షణాలు లేవని అధికారులు పేర్కొన్నారు. వైరస్ సోకిన 122 మందిని మండోలిలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు.

శుక్రవారం కొత్తగా 12 మందికి వైరస్‌ నిర్ధారణ అయ్యిందని తెలిపారు. నాలుగు రోజుల కిందట సీఆర్పీఎఫ్ ఎస్‌ఐ కరోనాతో చనిపోయిన విషయం తెలిసిందే. సెలవులపై వెళ్లి వచ్చిన ఓ కానిస్టేబుల్‌ నుంచే బెటాలియన్‌లో మిగతావారికి వైరస్‌ సంక్రమించి ఉంటుందని భావిస్తున్నారు. సెలవులపై వెళ్లొచ్చిన సీఆర్పీఎఫ్ నర్సింగ్ అసిస్టెంట్‌కు ఏప్రిల్ 21న వైరస్ నిర్ధారణ అయ్యింది. దీంతో అతడిని ఢిల్లీలోని రాజీవ్ గాంధీ హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందజేస్తున్నారు. ఆ తర్వాత ఏప్రిల్ 24న 15 మంది జవాన్లకు వైరస్ ఉన్నట్టు తేలింది.

ఒకే బెటాలియన్‌లోని సైనికులు ఇంత పెద్ద సంఖ్యలో వైరస్ బారినపడటంతో కేంద్ర హోం శాఖ దీనిని సీరియస్‌గా తీసుకున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. క్వారైంటైన్ విషయంలో సీఆర్పీఎఫ్ జారీచేసిన మార్గదర్శకాలు వివాదానికి దారితీశాయి. ఏప్రిల్ 1న జారీచేసిన మార్గదర్శకాల్లో ఎవరైనా సెలవుపై వెళ్లివచ్చిన లేదా అనుమానిత లక్షణాలు ఉన్నా, పాజిటివ్‌ వచ్చిన వ్యక్తితో కాంటాక్ట్ అయినా ఐదు రోజులు క్వారంటైన్‌లో ఉండాలని పేర్కొంది. అయితే, దీనిపై విమర్శలు రావడంతో దానిని 14 రోజులకు మారుస్తూ ఏప్రిల్ 17 కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది.

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. శుక్రవారం ఒక్క రోజే ఢిల్లీలో 223 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,738కి చేరుకుంది. అయితే.. ఢిల్లీ ప్రభుత్వం కరోనా పరీక్షలు ఎక్కువగా నిర్వహించడం వల్లే పాజిటివ్ కేసులు ఎక్కువ నమోదు అవుతున్నాయని సీఎం అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here