డాక్టర్లు, నర్సులకు గుడ్ న్యూస్.. అమెరికాలో నేరుగా గ్రీన్ కార్డు!

కరోనా వైరస్ ధాటికి వణుకుతున్న అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాలో ఉండే విదేశీ వైద్యులు, నర్సులకు శాశ్వత నివాసానికి అనుమతి ఇవ్వాలని భావిస్తున్నారు. ఇందుకు వీలు కల్పించే తీర్మానాన్ని కొందరు సభ్యులు చట్టసభల్లో ప్రవేశపెట్టారు. ఈ ఏడాది ఇంతవరకూ ఎవరికీ ఇవ్వని 40 వేల గ్రీన్ కార్డుల కోటాలో విదేశీ డాక్టర్లు, నర్సులకు ఇవ్వాలని ఇందులో ప్రతిపాదించారు. అమెరికాలో లక్షల మంది కరోనా బారిన పడుతున్న వేళ చట్టసభ ప్రతినిధులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ది హెల్త్‌కేర్‌ వర్క్‌ ఫోర్స్‌ రీసైలెన్స్‌ యాక్ట్‌ (హెల్త్ కేర్ సిబ్బంది పునరుద్ధరణ చట్టం) కింద ఎన్నో ఏళ్లుగా జారీ చేయకుండా ఉన్న గ్రీన్‌ కార్డులకు అనుమతి ఇచ్చే అధికారం అక్కడి కాంగ్రెస్‌కు (చట్టసభ) ఉంది. గ్రీన్ కార్డులను మంజూరు చేస్తే సదరు వైద్యులు అమెరికాలో శాశ్వత నివాసాన్ని పొందవచ్చు.

ఈ తాజా ప్రతిపాదనల బిల్లు ఒకవేళ ఆమోదం పొందితే దాదాపు 25 వేల మంది దాకా నర్సులు, 15 వేల మంది దాకా డాక్టర్లు గ్రీన్‌ కార్డులు పొందనున్నట్లు తెలుస్తోంది. అయితే, శాశ్వత నివాస అనుమతి పొందిన వారంతా కరోనాపై పోరులో భాగంగా వైద్య సేవలు అందించాల్సి ఉంటుంది. హెచ్‌-1బీ, జే2 వీసాలపై ఉన్న భారతీయ వైద్యులు, నర్సులకు ఇది ఎంతగానో ఉపయోగపడనుంది.

ప్రస్తుతం ఎదురవుతున్న విపత్కర పరిస్థితుల్లో దాని నుంచి బయటపడేందుకు ఉన్న ప్రతి అవకాశాన్ని పరిశీలిస్తున్నామని బిల్లు రూపకల్పనలో కీలక పాత్రపోషించిన చట్టసభ్యుడు ఒకరు అన్నారు. అమెరికాను వైద్య నిపుణుల కొరత వేధిస్తోందని ఆయన అన్నారు. మరోవైపు, ఇప్పటివరకూ అమెరికాలో 12 లక్షల మందికిపైగా కరోనా సోకగా.. మృతుల సంఖ్య 77 వేలు దాటింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here