టైమ్స్ రిపోర్ట్: తెలంగాణలో లాక్‌డౌన్ ఆంక్షలు సడలించొచ్చు.. మరి ఆంధ్రాలో?

ఏప్రిల్ 28 నాటికి దేశంలో సుమారు 30 వేల కరోనా కేసులు నమోదు కాగా.. మే 18 నాటికి దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య దాదాపు 40 వేలకు చేరే అవకాశం ఉందని టైమ్స్ నౌ ఇండియా ఔట్‌బ్రేక్ రిపోర్ట్ అంచనా వేసింది. ఇన్ఫెక్షన్ బారిన పడిన వ్యక్తి నుంచి కోవిడ్ సోకే ముప్పు (రీప్రొడక్షన్ రేటు) 1.92 నుంచి 1.85కి తగ్గుతుందని తెలిపింది. తెలంగాణ సహా దేశంలోని ఆరు ప్రధాన రాష్ట్రాల్లో మే 3న ఆంక్షలను సడలించే పరిస్థితి ఉంటుందని అంచనా వేసింది.

కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరాఖండ్, హర్యానా, ఒడిశా రాష్ట్రాలు ఇటీవలి రోజుల్లో కరోనా కేసుల సంఖ్యను నియంత్రించడంలో విజయం సాధించాయని ఈ రిపోర్ట్ అభిప్రాయపడింది. ఈ రాష్ట్రాలు రీప్రొడక్షన్ రేటును తగ్గించాయని తెలిపింది. మెరుగైన పరిస్థితుల్లో మే 18 నాటికి కేరళలో 3 యాక్టివ్ కేసులు మాత్రమే ఉంటాయని, అథమ పరిస్థితుల్లో 182 కేసులు ఉంటాయని టైమ్స్ నౌ ఇండియా ఔట్ బ్రేక్ రిపోర్ట్ అంచనా వేసింది.

ఏపీలో మే 11 నాటికి అథమ పరిస్థితుల్లో 1319 యాక్టివ్ కేసులు, మెరుగైన పరిస్థితుల్లో 861 యాక్టివ్ కేసులు ఉండే అవకాశం ఉందని.. మే 18 నాటికి ఆంధ్రాలో గరిష్టంగా 1650 కేసులు, కనిష్టంగా 926 యాక్టివ్ కేసులు ఉంటాయని అంచనా వేసింది. ఆంధ్రాలోనూ ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభించొచ్చని రిపోర్ట్ అభిప్రాయపడింది.

మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో ఇప్పుడే లాక్‌డౌన్ ఎత్తేస్తే ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని అంచనా వేసింది. మహారాష్ట్రలో మే 18 నాటికి గరిష్టంగా 23 వేల యాక్టివ్ కేసులు ఉండే అవకాశం ఉందని.. రాజస్థాన్‌లో 7 వేలకుపైగా యాక్టివ్ కేసులు ఉండొచ్చని రిపోర్ట్ అంచనా వేసింది.

కేంద్ర ప్రభుత్వం వెలువరించిన మీడియా బులెటిన్లు, కేంద్ర ఆరోగ్య శాఖ వెలువరించిన రోజువారీ అప్‌‌డేట్ల సమాచారాన్ని ఉపయోగించి ప్రోటివిటి, టైమ్స్ నౌ ఈ విశ్లేషణ చేశాయి. ఈ మ్యాథమెటికల్ మోడల్‌లో పర్సంటేజ్ బేస్డ్ మోడల్, టైమ్స్ సిరీస్ మోడల్, ఎస్ఈఐఆర్ మోడల్‌ను ఉపయోగించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here