టైమ్స్ ఫ్యాక్ట్ రిపోర్ట్: కరోనా కట్టడిలో భారత్ విజయం… మే 18 నాటికి ఎన్ని కేసులంటే?

మే 3న దేశవ్యాప్తంగా లాక్‌‌డౌన్ ముగిసే నాటికి దేశంలో గరిష్టంగా 28,149 కోవిడ్ యాక్టివ్ కేసులు ఉండే అవకాశం ఉందని టైమ్స్ ఫ్యాక్ట్ – ఇండియా ఔట్ బ్రేక్ రిపోర్ట్ అంచనా వేసింది. లాక్‌డౌన్ చివరి నాటికి దేశంలో యాక్టివ్ కేసుల 26,901 నుంచి 28,149 వరకు ఉండొచ్చని తెలిపింది. మే 11 నాటికి దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 36,268గా ఉండే అవకాశం ఉందని ఈ రిపోర్ట్ అంచనా వేసింది.

లాక్‌డౌన్ ముగిసిన రెండు వారాల తర్వాత అంటే మే 18 నాటికి పరిస్థితి అథమంగా ఉంటే 55,558 యాక్టివ్ కేసులు నమోదయ్యే అవకాశం ఉందని.. పరిస్థితి మెరుగ్గా ఉంటే ఆ సంఖ్య 34,923గా ఉండే అవకాశం ఉందనే అంచనాలను ఈ రిపోర్టు వెలువరించింది. మే 18 నాటికి యాక్టివ్ కేసుల సంఖ్య 40 వేలుగా ఉండే అవకాశం ఉందని అంచనా వేసింది. యాక్టివ్ కేసులను లెక్కించేటప్పుడు కోవిడ్ నుంచి కోలుకున్న వారిని పరిగణనలోకి తీసుకోరనే సంగతి తెలిసిందే.

వ్యాప్తిని భారత్ కట్టడి చేసిందని టైమ్స్ ఫ్యాక్ట్ – ఇండియా ఔట్ బ్రేక్ రిపోర్ట్ తెలిపింది. లాక్‌డౌన్, సోషల్ డిస్టెన్సింగ్ ఫలితాలను ఇచ్చిందని పేర్కొంది. ఇన్ఫెక్షన్ రేటు తగ్గుముఖం పడుతోందని తెలిపింది. లాక్‌డౌన్ నిబంధనలను సడలించిన తర్వాత యాక్టివ్ కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగే అవకాశం లేదని ఈ రిపోర్ట్ అంచనా వేసింది.

ఏప్రిల్ 28 నాటికి ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య 30 లక్షలకు పైగా ఉండగా.. 2.11 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. భారత్‌లో కోవిడ్ కేసుల సంఖ్య 30 వేలకు చేరువలో ఉండగా.. 937 మంది చనిపోయారు. మన దేశంలో కోవిడ్ పేషెంట్ల రికవరీ రేటు 23.44 శాతంగా ఉంది.

దాదాపు 50 రోజులపాటు దేశంలో నమోదవుతున్న కొత్త కేసులు, యాక్టివ్ పేషెంట్ల సంఖ్య ఆధారంగా.. దేశంలోని టాప్-9 రాష్ట్రాలు, నాలుగు ప్రధాన నగరాల్లో కేసుల సంఖ్య పెరుగుతున్న తీరు ఆధారంగా కరోనా పరిస్థితిని టైమ్స్ ఫాక్ట్ – ఇండియా ఔట్ బ్రేక్ రిపోర్ట్ ఈ విశ్లేషణ చేసింది. భవిష్యత్తులో కేసుల సంఖ్య ఇలా ఉంటుందనడానికి ఈ అధ్యయనం సూచిక కాదు. కానీ సంభావ్యతను బట్టి వేసిన అంచనాలు మాత్రమే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here