జాను : మూవీ రివ్యూ

చిత్రం : ‘జాను’

నటీనటులు: శర్వానంద్ – సమంత – వెన్నెల కిషోర్ – శరణ్య ప్రదీప్ – తాగుబోతు రమేష్ – రఘుబాబు – వర్ష బొల్లమ్మ తదితరులు
సంగీతం: గోవింద్ వసంత
ఛాయాగ్రహణం: మహేంద్రన్ జయరాజు
అడిషనల్ డైలాగ్స్: మిర్చి కిరణ్
నిర్మాత: దిల్ రాజు
రచన – దర్శకత్వం: ప్రేమ్ కుమార్

తమిళంలో క్లాసిక్ గా నిలిచిన ‘96’ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన చిత్రం ‘జాను’. శర్వానంద్.. సమంత జంటగా మాతృక దర్శకుడు ప్రేమ్ కుమారే ఈ చిత్రాన్ని కూడా రూపొందించాడు. దిల్ రాజు నిర్మించిన ‘జాను’ ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి తమిళంలో మాదిరే ఇక్కడా ఈ చిత్రం మ్యాజిక్ క్రియేట్ చేసిందేమో చూద్దాం పదండి.

కథ:

రామచంద్ర (శర్వానంద్) ఒక ట్రావెల్ ఫొటోగ్రాఫర్. తన విద్యార్థులతో కలిసి ఓ టూర్లో భాగంగా అతను తాను పదో తరగతి వరకు చదువుకున్న విశాఖపట్నానికి వస్తాడు. ఆ సందర్భంగా తన పాఠశాలకి వెళ్తాడు. దీంతో అతడికి పాత జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తాయి. జానకి అలియాస్ జాను (సమంత)తో ప్రేమ అనుభవాల్ని గుర్తు చేసుకుంటాడు. ఈ క్రమంలోనే తన స్నేహితులందరికీ ఫోన్ చేయగా.. అందరూ కలిసి రీయూనియన్ ఫంక్షన్ పెట్టుకుందామని అనుకుంటారు. ఆ కార్యక్రమానికి జాను కూడా వస్తుంది. ఇంతకీ జాను ఏం చేస్తోంది.. ఆమె జీవితం ఎలా మారింది.. అసలు రామచంద్ర-జాను ఎందుకు విడిపోవాల్సి వచ్చింది.. వర్తమానంలో మళ్లీ కలిశాక వారి ప్రయాణం ఎలా సాగింది అన్నది మిగతా కథ.

కథనం – విశ్లేషణ:

రీమేక్ అంటే కత్తి మీద సాములా అయిపోయింది ఈ రోజుల్లో. మాతృకలో ఉన్నదున్నట్లుగా తీయాలా.. ఇక్కడి ప్రేక్షకుల అభిరుచిని దృష్టిలో ఉంచుకుని మార్పులేమైనా చేయాలా అన్న మీమాంస మొదలవుతుంది ముందుగా. తర్వాత ప్రధాన పాత్రలకు నటీనటుల ఎంపిక దగ్గర దగ్గరా తలనొప్పే. భాషల మధ్య హద్దులు చెరిగిపోయి.. డిజిటల్ విప్లవం పుణ్యమా అందరూ అన్ని సినిమాలూ చూసేస్తూ విశేషాలన్నీ తెలుసుకుంటున్నపుడు.. ప్రేక్షకుల్లో ఎగ్జైట్మెంట్ తీసుకురాగలగడం ఓ సవాలు. వీటన్నింటికీ మించి ఒక క్లాసిక్ లవ్ స్టోరీని రీమేక్ కోసం ఎంచుకుని ఒరిజినల్లోని ఫీల్ ను మళ్లీ తీసుకురావాలంటే అది పెను సవాలే. ఐతే ‘జాను’ టీం ఈ సవాలును ఛేదించింది. ‘96’ మ్యాజిక్ ను రీక్రియేట్ చేయగలిగింది.

‘96’ సినిమా రీమేక్ విషయంలో నిర్మాత దిల్ రాజు చేసిన మంచి పనేంటంటే.. దీన్ని ఒరిజినల్ డైరెక్టర్ ప్రేమ్ కుమార్ చేతుల్లోనే పెట్టడం.. అతడి శర్వానంద్.. సమంత లాంటి మంచి జోడీని అప్పగించడం. ఇక్కడే సగం పని విజయవంతంగా పూర్తయింది. ఇక ప్రేమ్ కుమార్ మరోసారి తన కథను పూర్తిగా ఆస్వాదిస్తూ మరోసారి మనస్ఫూర్తిగా సినిమా తీశాడు. శర్వా.. సమంత ఇద్దరూ కూడా తమ పాత్రల్ని ఓన్ చేసుకుంటూ వాటికి జీవం పోశారు. ఇక కథలోని స్వచ్ఛత.. భావోద్వేగాల్లోని గాఢత కొనసాగడంతో ‘96’కు తగ్గని స్థాయిలో ‘జాను’ తయారైంది. ‘96’కు జిరాక్స్ కాపీలా అనిపించినా సరే.. మాతృకను చూసిన వాళ్లలో కూడా మరోసారి అదే ఫీల్ తీసుకొచ్చేలా ‘జాను’ తయారైంది.

‘జాను’ ఒక రీమేక్ అనే సంగతి పక్కన పెట్టి చూస్తే.. ఇది ఎవరైనా రిలేట్ చేసుకోగలిగే స్వచ్ఛమైన ప్రేమకథ. ఇక రెండు దశాబ్దాల కిందట స్కూలింగ్ పూర్తి చేసిన నిన్నటి తరం వాళ్లయితే ‘జాను’తో ఎమోషనల్ గా కనెక్టయిపోతారు. మొబైళ్లు.. ఇతర టెక్నాలజీ మన జీవితాల్ని కమ్మేయడానికి ముందు.. కమ్యూనికేషన్ చాలా తక్కువగా ఉన్నపుడు పాఠశాల దశలో ఓ అబ్బాయి అమ్మాయి స్వచ్ఛంగా ప్రేమించుకుంటే ఎలా ఉంటుందో ప్రేమ్ కుమార్ కళ్లకు కట్టినట్లు చూపించాడు. స్కూల్ లవ్ స్టోరీ అనగానే ఇదేదో పరిణతి లేని పిల్లల వ్యవహారం అనుకునేలా కాకుండా.. మనసుకు హత్తుకునేలా చెప్పిన వైనం ‘96’ను ప్రత్యేకంగా నిలబెడుతుంది. పాత్రల్లో.. సన్నివేశాల్లోని స్వచ్ఛత హృదయాల్ని బరువెక్కిస్తుంది. స్కూల్ సీన్లన్నీ ప్రేక్షకులందరికీ నోస్టాల్జిగ్గా అనిపిస్తాయి.

చిన్న మిస్ కమ్యూనికేషన్ కారణంగా హీరో హీరోయిన్లు విడిపోవడం.. వాళ్ల జీవితాలే మారిపోవడం ఈ తరం ప్రేక్షకులకు కొంచెం నాటకీయంగా అనిపిస్తే అనిపించొచ్చు కానీ.. 20 ఏళ్ల కిందటి పరిస్థితులు తెలిసిన వాళ్లకు ‘జాను’ కథ వాస్తవికంగానే అనిపిస్తుంది. హీరో హీరోయిన్ ఒకరి కోసం ఒకరు ఎలా తపించారో.. వాళ్ల ప్రేమ ఎంత స్వచ్ఛమైందో తెలియజేసే రెండు సన్నివేశాలు ‘జాను’కు ఆకర్షణ. హార్ట్ బ్రేకింగ్ గా అనిపించే ఆ సన్నివేశాల్ని దర్శకుడు తీర్చిదిద్దిన వైనం.. అందులో శర్వా సమంతల అభినయం.. కెమెరా యాంగిల్స్.. నేపథ్య సంగీతం అన్నీ కూడా గొప్పగా అనిపిస్తాయి. ఆ సీన్లలో అప్రయత్నంగా ప్రేక్షకులకు కన్నీళ్లు వస్తాయి. చివరికి వచ్చేసరికి భావోద్వేగాలు పతాక స్థాయికి చేరి బరువైన హృదయంతో థియేటర్ల నుంచి బయటికొస్తాం. పాత్రల ఔచిత్యం దెబ్బ తినకుండా.. అవి ఎక్కడా హద్దులు దాటకుండా దర్శకుడు నియంత్రణ పాటించిన తీరుకు అభినందనలు చెప్పాల్సిందే.

ప్రేమకథల్ని ఇష్టపడేవాళ్లకు.. ఫీలయ్యే వాళ్లకు ‘జాను’ ఒక మంచి జ్ఞాపకంగా నిలుస్తుంది. జీవితంలో ఏద ఒక దశలో ప్రేమ భావనలు పొందిన ప్రతి ఒక్కరూ ఈ కథతో ప్రేమలో పడతారు. నరేషన్ మరీ స్లో అన్నది సినిమా మీద వచ్చే పెద్ద కంప్లైంట్. ఈ కథను ఇలాగే చెప్పాలన్న దర్శకుడి కన్విక్షన్ అర్థం చేసుకోదగ్గదే అయినా.. కొన్ని చోట్ల కథనం మరీ నెమ్మదించింది. తమిళంలో మాదిరే స్కూల్ లవ్ స్టోరీ 90ల్లో నడిచినట్లు చూపిస్తే బాగుండేది. ఈ విషయంలో కొంత స్పష్టత కొరవడి.. కొన్ని చోట్ల లాజిక్ మిస్సయిన ఫీలింగ్ కలగుతుంది. ఇక రూరల్ ఆడియన్స్ మరీ క్లాస్ గా సాగే ఈ ప్రేమకథతో ఏమాత్రం కనెక్టవుతారన్నది చెప్పలేం. మాతృకను చూసిన వాళ్లకు మరోసారి ఆ ఫీల్ కలుగుతుందా అన్నది సందేహం. రీమేక్ అనగానే ఉండే నిరాసక్తతకు తోడు చాలామంది మాతృకను చూసి ఉండే అవకాశముంది కాబట్టి ‘జాను’ కమర్షియల్ గా ఎలాంటి ఫలితాన్నందుకుంటుందో చూడాలి.

నటీనటులు:

తమిళంలో విజయ్ సేతుపతి లాంటి గ్రేట్ పెర్ఫామర్ చేసిన పాత్రలో కనిపించిన శర్వా.. ఆ పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. పాత్ర స్వభావ రీత్యా సేతుపతితో పోలికలు కనిపించినప్పటికీ శర్వా కొన్ని చోట్ల తనదైన పెర్ఫామెన్స్ తో ప్రత్యేకతను చాటుకున్నాడు. క్లోజప్ షాట్లతో శర్వా వంక పెట్టలేని నటనతో కట్టిపడేశాడు. తన కోసం జాను ఎదురు చూసిందన్న విషయం తెలిసినపుడు శర్వా హావభావాలు వావ్ అనిపిస్తాయి. సమంత సైతం తనదైన శైలిలో జాను పాత్రను పండించింది. లుక్స్ పెర్ఫామెన్స్ విషయంలో త్రిషతో పోలిస్తే సమంత తక్కువగా కనిపిస్తుంది కానీ.. తెలుగులో ఈ పాత్ర చేయడానికి సమంత కంటే మంచి ఛాయిస్ లేదన్న ఫీలింగ్ కలిగించేలా ఆమె నటించింది. ఎమోషనల్ సీన్లలో సమంత నటన గుర్తిండిపోతుంది. సినిమాలో మిగతా పాత్రలకు ప్రాధాన్యం తక్కువే. చిన్న పాత్రలో వర్ష బొల్లమ్మ మెరిసింది. వెన్నెల కిషోర్.. శరణ్య.. తాగుబోతు రమేష్.. రఘుబాబు పాత్రలకు తగ్గట్లుగా నటించి మెప్పించారు.

సాంకేతిక వర్గం:

‘జాను’కు సాంకేతిక నిపుణులు గొప్ప బలంగా నిలిచారు. సన్నివేశాల్లోని ఫీల్ ను మరింత పెంచేలా గోవింద్ వసంత సోల్ ఫుల్ మ్యూజిక్ ఇచ్చాడు. పాటలు.. నేపథ్య సంగీతం హృదయాల్ని కదిలిస్తాయి. కొన్ని చోట్ల మ్యూజిక్ థీమ్స్ ఒక అలజడి కలిగిస్తాయి. మహేంద్రన్ జయరాజు విజువల్స్ కూడా బాగున్నాయి. చాలా తక్కువ లొకేషన్లలో సినిమాను తీసేసినా సరే.. మొనాటనస్ ఫీలింగ్ రాకుండా కెమెరాతో మ్యాజిక్ చేశాడు మహేంద్రన్. నిర్మాణ విలువల విషయంలో వంక పెట్టడానికేమీ లేదు. సినిమాకు ఏం అవసరమో అదంతా సమకూర్చింది దిల్ రాజు టీం. ఇక రైటర్ కమ్ డైరెక్టర్ ప్రేమ్ కుమార్.. ఇద్దరు ప్రేమికుల వాస్తవ జీవితాల్ని తెర మీద చూస్తున్న ఫీలింగ్ కలిగించాడు. ఇందులో అతడి అనుభవాలు ఎంత వరకు ఉన్నాయో కానీ.. చాలామంది ఈ కథతో.. సన్నివేశాలతో రిలేట్ అయ్యేలా సినిమాను తీర్చిదిద్దాడు. అతడిలో గొప్ప భావుకత కనిపిస్తుంది. నరేషన్ స్లో అనే సంగతి పక్కన పెడితే.. అతడి దర్శకత్వంలో లోపాలేమీ కనిపించవు. తన కథను రెండోసారి తీస్తూ కూడా మ్యాజిక్ రీక్రియేట్ చేయడంలో అతను విజయవంతం అయ్యాడు.

చివరగా: జాను.. ఎమోషనల్ లవ్ జర్నీ

రేటింగ్-2.75/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here