చైనా‌కు ఝలక్ ఇవ్వబోతున్న భారత్ .. 1000కిపైగా అమెరికా సంస్థలతో చర్చలు!

కరోనా వైరస్ కారణంగా అంటేనే ట్రంప్ మండిపడుతున్న వేళ.. చైనాలోని అమెరికా కంపెనీలను భారత్‌ తీసుకొని రావడం కోసం మోదీ సర్కారు వ్యూహాలు రూపొందిస్తోంది. చైనా నుంచి బయటకు రావాలని భావిస్తోన్న వెయ్యికిపైగా అమెరికా ఉత్పత్తి సంస్థలను సంప్రదించిన భారత సర్కారు ఇన్సెంటివ్‌లను ఆఫర్ చేసింది. వైద్య పరికరాలు సరఫరా చేసే సంస్థలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, టెక్స్‌టైల్స్, లెదర్, ఆటో పార్ట్ తయారీ సంస్థలకు ప్రాధాన్యం ఇస్తోందని సమాచారం.

కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడంలో చైనా విఫలమైందని ట్రంప్ ఆరోపిస్తున్నారు. అంతకు ముందు నుంచే అమెరికా, చైనా మధ్య అంతంత మాత్రంగానే ఉన్న సంబంధాలు… కోవిడ్ దెబ్బకు మరింత దిగజారాయి. కరోనా ప్రభావంతో సంస్థలు ఒకే చోట తమ కార్యకలాపాలను కేంద్రీకరించొద్దని భావిస్తున్నాయి. చైనాలో ఉన్న తమ ఫ్యాక్టరీలను స్వదేశానికి రప్పించడం కోసం జపాన్ ఇప్పటికే 2.2 బిలియన్ డాలర్ల ప్యాకేజీని ప్రకటించింది. యూరోప్ దేశాలు కూడా చైనా నుంచి దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని భావిస్తున్నాయి.

ముఖ్యంగా అమెరికాకు చెందిన హెల్త్‌కేర్ ఉత్పత్తులు, పరికరాల సంస్థలు భారత్ వస్తాయని మోదీ సర్కారు ఆశిస్తోంది. మెడ్‌ట్రోనిక్, అబోట్ ల్యాబోరేటరీస్ లాంటి సంస్థలు తమ యూనిట్లను భారత్‌కు తరలించడం కోసం చర్చలు జరుగుతున్నాయి. ఈ రెండు సంస్థలు ఇప్పటికే భారత్‌ నుంచి కూడా కార్యకలాపాలు సాగిస్తుండటంతో.. చైనా నుంచి తమ ఉత్పత్తి యూనిట్లను తరలించడం సులభతరం అవుతుందని అధికారులు భావిస్తున్నారు.

అమెరికా, జపాన్, చైనాలతో పోలిస్తే. భారత్‌లో తక్కువ ధరకే భూమిని సేకరించొచ్చని.. నైపుణ్యం ఉన్న మానవ వనరుల లభ్యత కూడా అధికమని అధికారులు సంస్థలకు చెబుతున్నారు. కార్మిక చట్టాలను మార్చడానికి కూడా ప్రభుత్వం సుముఖంగా ఉందని కంపెనీలకు తెలిపారు. చాలా సంస్థలు ఇప్పటికే వియత్నాం వైపు మొగ్గు చూపాయి. కానీ వియత్నాం, కాంబోడియా లాంటి దేశాలతో పోలిస్తే భారత్ మార్కెట్ పెద్దదనే విషయాన్ని నిపుణులు గుర్తు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here