గ్రీన్ జోన్‌ జిల్లాలో ఒక్కరోజే ఏకంగా 21 కేసులు.. కర్ణాటకలో కలకలం

మహమ్మారిని అదుపుచేయడానికి విధించిన లాక్‌డౌన్ మూడో దశ సోమవారం నుంచి ప్రారంభమయ్యింది. వైరస్ కేసుల నమోదు ఆధారంగా దేశం మొత్తాన్ని మూడు జోన్‌లుగా విభజించి, ఆంక్షలతో కూడిన కార్యకలాపాలకు గ్రీన్, ఆరెంజ్ జోన్‌లలో అనుమతి ఇచ్చారు. ఇప్పటి వరకూ ఒక్క కేసు కూడా లేని ప్రాంతాలను గ్రీన్‌ జోన్‌గా.. 10లోపు కేసులు ఉన్న ప్రాంతాన్ని ఆరెంజ్ జోన్, పెద్ద సంఖ్యలో కేసులు నిర్ధారణ అయిన ప్రాంతాలను రెడ్ జోన్‌గా పరిగణిస్తారు. రెడ్ జోన్‌లలో ఆంక్షలు కఠినంగా కొనసాగనుండగా.. గ్రీన్, ఆరెంజ్ జోన్‌లలో పరిమితంగా పనులకు వెసులబాటు కల్పించారు.

ఇదిలా ఉండగా.. గ్రీన్‌జోన్‌గా ఉన్న కర్ణాటకలోని దావణగెరె జిల్లాలో ఆదివారం ఒక్కరోజే 21 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడం అధికారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ జిల్లాలో వారం రోజుల క్రితం కంటెయిన్‌మెంట్ సమయం ముగియడంతో కొత్త కేసులు నమోదు కాకపోవడంతో గ్రీన్ జోన్‌గా ప్రకటించారు. దీంతో ప్రజలు కాసింత ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో పులిమీద పుట్రలా ఏకంగా 21 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిది. కొందరిలో జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలు కనిపించడంతో మొత్తం 164 మంది నమూనాలను సేకరించిన అధికారులు, వాటిని పరీక్షలకు పంపారు. వీరిలో 21 మందికి వైరస్ ఉన్నట్టు తేలడంతో, అధికారులు మరోసారి అప్రమత్తం అయ్యారు. ఎవరి నుంచి వారికి కరోనా సోకిందన్న వివరాలపై స్పష్టత లేకపోవడంతో అధికారులు కలవరపడుతున్నారు.

గతంలో ఈ జిల్లాలో 10 పాజిటివ్ కేసులు రాగా, ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఆపై కొత్త కేసులు నమోదు కాకపోవడంతో గ్రీన్ జోన్‌గా ప్రకటించారు. తాజాగా 21 కేసుల నమోదు కావడంతో తిరిగి జిల్లాను రెడ్ జోన్‌గా ప్రకటించిన అధికారులు, లాక్‌డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని నిర్ణయించారు. దావణగెరె మున్సిపల్ కమిషనర్ మహాతేశ్ బెలాగీ మాట్లాడుతూ… 21 మందికి వైరస్ ఉన్నట్టు నిర్ధారణ కావడంతో అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమావేశం ఏర్పాటుచేసినట్టు తెలిపారు. వైరస్ ఎవరి నుంచి వ్యాపించిందనే విషయాన్ని గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొన్నారు.

వైరస్ ముప్పు అధికంగా ఉన్న 94 మంది నమూనాలు శుక్రవారం.. 72 మంది నమూనాలు శనివారం సేకరించి, పరీక్షలు నిర్వహించినట్టు ఆయన వివరించారు. కాగా, కర్ణాటకలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 614కి చేరుకోగా.. 25 మంది ప్రాణాలు కోల్పోయారు. వైరస్ నిర్ధారణ అయినవారిలో 293 మంది కోలుకోగా.. మరో 327 మంది హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. లాక్‌డౌన్ ఆంక్షలు సడలించేందుకు కర్ణాటక ప్రభుత్వం సిద్ధమైన వేళ ఒక్కసారిగా గ్రీన్‌ జోన్2లో కేసులు పెరగడం గమనార్హం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here