గుజరాత్ ప్రభుత్వానికి షాక్.. ఆ మంత్రి ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు తీర్పు

మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే భూపేంద్ర సింహ్‌ చుడాసమా ఎన్నిక చెల్లదంటూ మంగళవారం సంచలన తీర్పు వెలువరించింది. 2017 శాసనసభ ఎన్నికల్లో ఆయన అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ కాంగ్రెస్ అభ్యర్థి హైకోర్టులో ఎన్నికల పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. ఎమ్మెల్యే చుడాసమా అక్రమాలకు పాల్పడినట్టు నిర్ధారించింది. ఆయన ఎన్నిక చెల్లదంటూ ఈ మేరకు మంగళవారం తుది తీర్పు వెల్లడించింది. 2017 ఎన్నికల్లో చూడసమా ధోల్కా నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. కాంగ్రెస్‌ అభ్యర్థి‌ అశ్విన్ రాథోడ్‌‌పై చూడసమా కేవలం 327 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

ఎన్నికల ప్రక్రియ వివిధ దశలలో ముఖ్యంగా ఓట్ల లెక్కింపు సమయంలో ఎన్నికల కమిషన్ నిబంధనలను ఉల్లంఘించారని, గెలుపు కోసం అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని అశ్విన్ ఆరోపించారు. ఆయన దాఖలుచేసిన ఎన్నికల పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. దర్యాప్తునకు ఆదేశించింది. దీనిపై ఎన్నికల కమిషన్ దర్యాప్తు చేపట్టి నివేదికను హైకోర్టుకు సమర్పించింది. చుడాసమా అక్రమాలకు పాల్పడినట్టు హైకోర్టు ఈసీ వివరించింది. దీంతో ఆయనను అనర్హుడిగా ప్రకటిస్తూ మంగళవారం తీర్పును వెలువరించింది.

ప్రస్తుతం గుజరాత్ ముఖ్యమంత్రి మంత్రివర్గంలో భూపేంద్ర సింహ్ చుడసమా.. విద్య, న్యాయ, శాసనసభ వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వీటితోపాటు మరికొన్ని శాఖలను కూడా ఆయనకు సీఎం అప్పగించారు. తాజాగా, హైకోర్టు ఆయనను అనర్హుడిగా ప్రకటించడంతో దీనిపై సుప్రీంలో సవాల్ చేస్తారా? లేదా? అనే అంశంపై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నారు. 2017 డిసెంబరులో జరిగిన గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ వరుసగా ఐదోసారి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్ధి కాంగ్రెస్, బీజేపీల మధ్య హోరాహోరీ పోరునెలకొనగా కమలనాథులు అతికష్టంతో అధికారం సాధించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here