కేరళ మహిళకు 45 రోజుల్లో 19సార్లు పాజిటివ్.. ఎట్టకేలకు 20వసారి ఉపశమనం

డబ్ల్యూహెచ్ఓ ప్రకారం ఒక వ్యక్తి శరీరంలో 14 నుంచి 28 రోజుల వరకూ ఉంటుంది. ఈ సమయంలోనే కోవిడ్-19 లక్షణాలు ఉంటే బయటపడతాయి. రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండి.. వైరస్ లక్షణాలు స్వల్పంగా ఉంటే వ్యాధిని తర్వగా కోలుకుంటారు. ఒకవేళ ఇతర అనారోగ్య కారణాలు ఉంటే వారిలో వైరస్ తగ్గడానికి కొంత సమయం పడుతుంది. అయితే, కేరళకు చెందిన ఓ మహిళకు మాత్రం కరోనా వైరస్ నిర్ధారణ అయిన 42 రోజుల వరకూ మహమ్మారి నుంచి ఊరట లభించలేదు. కరోనా వైరస్‌తో నెలన్నరగా హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న బాధితురాలికి ఎట్టకేలకు ఊరట లభించింది.

20వ సారి చేసిన పరీక్షలో ఆమెకు నెగిటివ్’ ఫలితం వచ్చింది. తదుపరి పరీక్షలోనూ నెగిటివ్ వస్తే ఆమెకు కరోనా నుంచి పూర్తి విముక్తి లభిస్తుంది. అంతకు ముందు 19సార్లు పరీక్షలు నిర్వహించగా ప్రతిసారీ పాజిటివ్‌గా రావడం గమనార్హం. పథనంతిట్ట జిల్లా వదాసెరిక్కరకకు చెందిన 62 ఏళ్ల మహిళకు మార్చిలో కరోనా వైరస్ సోకింది. ఇటలీకి వెళ్లొచ్చిన ఓ కుటుంబంతో ఈమె సన్నిహితంగా మెలగడం వల్ల మహమ్మారి బారినపడ్డారు. ఈ జిల్లాలో మొట్టమొదట కరోనా వైరస్ సోకినవారిలో ఆమె కూడా ఒకరు. డయాబెటిస్‌తోనూ బాధపడుతున్న ఆమెను మార్చి 10న చికిత్స కోసం హాస్పిటల్‌లో చేర్పించారు.

దాదాపు 45 రోజులుగా చికిత్స పొందుతున్న బాధిత మహిళకు 19సార్లు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అన్నిసార్లూ ‘పాజిటివ్‌’ అని తేలింది. చివరి ప్రయత్నంగా శిలీంద్రాల వ్యాధులకు వాడే ఇవర్‌మెక్టిన్ అనే ఔషదాన్ని ఏప్రిల్ 14 నుంచి ఆమెకు వైద్యులు ఇస్తున్నారు. వారం రోజుల తర్వాత బుధవారం 20వ సారి ఆమె నమూనాను పరీక్షకు పంపారు. ఇందులో తొలిసారిగా ‘నెగిటివ్‌’ రావడంతో వైద్యులు కొంత ఊపిరి పీల్చుకున్నారు. అయినా, నిబంధనల ప్రకారం ఆమె నమూనాలు మరోసారి పరీక్షించి, నెగెటివ్ వస్తేనే డిశ్ఛార్జి చేస్తారు. నిబంధనల ప్రకారం వరుసగా రెండుసార్లు ‘నెగిటివ్‌’ వస్తేనే ఆమె పూర్తిగా కోలుకున్నట్లు లెక్క. వచ్చేవారం మరోసారి పరీక్ష జరిగే అవకాశం ఉంది.

ప్రస్తుతం పథనంతిట్టలోని కోజాన్‌చెరి జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్యం స్థిరంగానే ఉంది. మధుమేహం తప్ప ఇతరత్రా సమస్యలేమీ లేవని వైద్యులు తెలిపారు. కానీ, ఆమె కేసును మరింత లోతుగా పరిశీలించడానికి ఒక ప్రత్యేక వైద్య బృందం రానుంది. దీనిపై పథనంతిట్టా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శైలజ మాట్లాడుతూ.. ఇటలీ వెళ్లొచ్చిన ఓ కుటుంబంతో సన్నిహితంగా మెలిగిన బాధితురాలికి వైరస్ సోకిందన్నారు. అంతేకాదు, ఆమెలో కరోనా లక్షణాలు కూడా పెద్దగా కనిపించలేదన్నారు. 19సార్లు పరీక్షలు నిర్వహించినా పాజిటివ్‌గా రావడంతో వివిధ డ్రగ్స్ కాంబినేషన్‌ను చికిత్సలో వినియోగించినట్టు తెలిపారు.

గతంలో కోజికోడ్ జిల్లాలోనూ ఓ వ్యక్తి విషయంలో ఇలాంటి అనుభవమే ఎదురయ్యింది. మార్చి 18న దుబాయి నుంచి వచ్చిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అతడికి 29 రోజుల వరకూ వైరస్ పాజిటివ్‌గానే తేలింది. అనంతరం నెగెటివ్ రావడంతో హాస్పిటల్ నుంచి ఇంటికి పంపారు. దీంతో కేరళలో క్వారంటైన్ 28 రోజులకు పెంచారు. తబ్లీగ్ జమాత్‌‌కు వెళ్లొస్తున్నవారితో కలిసి రైల్లో ప్రయాణించిన పథనంతిట్టాకు చెందిన యువతికి 22 రోజుల తర్వాత వైరస్ నిర్దారణ అయ్యింది. ఆమెలో ఎలాంటి లక్షణాలు కనిపించకపోయినా నమూనా పరీక్షల్లో వైరస్ ఉన్నట్టు గుర్తించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here