కృత్రిమ మేధ సాయంతో కరోనా జన్యువుల గుట్టురట్టు.. వ్యాక్సిన్ తయారీకి మరిం ఊతం

ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కొత్తరకం కరోనా వైరస్‌కు చెందిన 29 భిన్నమైన జన్యు పరివర్తన క్రమాల్లో (డీఎన్‌ఏ సీక్వెన్సెస్‌) అంతర్లీనంగా ఉండే జన్యు ఉత్పరి వర్తనాలను నిమిషాల్లోనే గుర్తించేందుకు శాస్త్రవేత్తలు కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)ని ఉపయోగించారు. కోవిడ్‌-19కు వ్యాక్సిన్‌, చికిత్సను కనుగొనేందుకు ఇది కీలకంగా మారుతుందని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిశోధనలో భారత సంతతి శాస్త్రవేత్త కూడా పాలుపంచుకున్నారు.

ప్రాణాంతకమైన సార్స్‌-కొవ్‌-2 వైరస్‌లను వర్గీకరించేందుకు ఇదెంతగానో ఉపయోగపడుతుందని కెనడాలోని వెస్ట్రన్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్త, భారత సంతతి వ్యక్తి గుర్జీత్‌ రణధావా అన్నారు. ఈ సాధనం ద్వారా అత్యంత సులభంగా, వేగంగా గుర్తించవచ్చని వెల్లడించారు. మహమ్మారిని కట్టడి చేసి.. వ్యూహ రచన, వైద్య సహాయం అందజేయడానికి ఉపయోగపడుతుందని వ్యాఖ్యానించారు. గబ్బిలాల్లో ఉండే సర్బికో వైరస్‌లోనే కొవిడ్‌-19 మూలాలు ఉన్నాయని ప్లోస్‌ వన్‌ జర్నల్‌లో ప్రచురించిన ఈ పరిశోధన అంచనా వేసింది.

గ్రాఫిక్‌ ఆధారంగా ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌, డెసిషన్‌ ట్రీ విధానం ద్వారా అత్యంత వేగంగా, కచ్చితత్వంతో వర్గీకరణ చేయొచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. కొత్తరకం కరోనా వైరస్‌ జీనోమ్‌ సిగ్నేచర్లను మెషిన్‌ లెర్నింగ్‌ విధానం 100 శాతం కచ్చితత్వంతో గుర్తిస్తుందని పేర్కొన్నారు. కేవలం నిమిషాల్లోనే 5,000కు పైగా వైరస్ జన్యువులతో కరోనాతో సంబంధాల్ని గుర్తించామని తెలిపారు.

‘అంతర్గత క్రమం నమూనాలను కనుగొనేందుకు మనకిప్పుడు కావాల్సింది కేవలం కొవిడ్‌-19 జన్యుపరివర్తన క్రమాలే. మెషిన్‌ లెర్నింగ్‌ను ఉపయోగించి నిమిషాల్లోనే జీనోమ్‌ సిగ్నేచర్లను కనుగొన్నాం’ అని ఇదే పరిశోధనలో పాల్గొన్న మరో శాస్త్రవేత్త కాథ్లీన్‌ హిల్ అన్నారు. జనవరి 27 నాటికి అందుబాటులో ఉన్న 29 జన్యుపరివర్తనాలు సహా 5 వేలకు పైగా జన్యుపరివర్తన క్రమాలను విశ్లేషించామమని పేర్కొన్నారు.

కొవిడ్‌-19కు వ్యాక్సిన్‌, చికిత్సను అభివృద్ధి చేయడానికి ఇది ఉపయోగపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సాధ్యమైనంత మేర ఇతర వైరస్‌లకు దగ్గరగా ఆ నమూనాను సరిపోల్చడానికి తార్కిక విధానాన్ని ఉపయోగించామని, నిమిషాల్లోనే ఫలితాలను సాధించామన్నారు. మెషిన్ లెర్నింగ్ అనేది కృత్రిమ మేధకు అనువర్తనం.. ఎలాంటి ప్రోగ్రామింగ్ చేయకుండా స్వయంచాలకంగా నేర్చుకుని, మెరుగుపరిచే సామర్థ్యాన్ని వ్యవస్థలకు అందజేస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here