కూరగాయలు అమ్ముకుంటున్న నగల వ్యాపారి

పా తికేళ్లుగా నగల వ్యాపారం చేస్తున్న అతడు అదే దుకాణంలో కూరగాయలు అమ్ముకోవాల్సి వస్తుందని ఏ రోజూ అనుకోలేదు. దుకాణంలో అందంగా ముస్తాబుచేసిన బంగారు ఆభరణాల స్థానంలో ఆకుపచ్చని కూరగాయలు కొలువుదీరుతాయని కలలో కూడా ఊహించలేదు. కానీ, కరోనా మహమ్మారి మనిషి జీవితాన్ని తలకిందులు చేస్తోంది. చరిత్రలో ఎన్నడూ చూడనంత గడ్డు కాలాన్ని కళ్లకు కడుతోంది. ఆదాయం లేక, పూట గడవక కుటుంబాన్ని పోషించుకునేందుకు జైపూర్‌లో ఓ చిరు నగల వ్యాపారి తన దుకాణాన్ని కూరగాయల కొట్టుగా మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

హుకుమ్‌చంద్ సోని అనే వ్యక్తి పాతికేళ్లుగా రాజస్థాన్‌ రాజధాని జైపుర్‌లోని రామ నగర్‌లో ‘జీపీ జ్యుయలరీ షాప్’ పేరుతో‌ నగల దుకాణం నిర్వహిస్తున్నాడు. చిన్న చిన్న బంగారు ఆభరణాలు, ఉంగరాలు అమ్ముతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. బంగారు గొలుసుల రీపేర్ల ద్వారానూ ఆదాయం పొందుతున్నాడు. కానీ, లాక్‌డౌన్‌‌తో పరిస్థితి తలికిందులైంది. నగలం దుకాణాన్ని కూరగాయల కొట్టుగా మార్చేశాడు.

‘నేను నాలుగు రోజులుగా కూరగాయలు అమ్ముతున్నా. నా కుటుంబాన్ని పోషించడానికి ఇప్పుడు నాకున్న మార్గం ఇదొక్కటే. ఇన్నేళ్లుగా నేను పెద్దగా కూడబెట్టింది లేదు, ఆస్తులూ లేవు. అందువల్ల ఇది తప్పదు’ అని హుకుమ్‌చంద్ అన్నాడు. పీటీఐ ప్రతినిధితో తన అనుభవాలు పంచుకున్నాడు.

Must Read:

‘నాది ఖరీదైన నగలు అమ్మే షాపేం కాదు. చిన్న చిన్న ఆభరణాలు, రింగులు అమ్ముతూ, దెబ్బతిన్న వాటికి మరమ్మతులు చేస్తూ ఆదాయం పొందేవాడిని. లాక్‌డౌన్‌ కారణంగా మార్చి 25 నుంచి నా దుకాణాన్ని మూసి ఉంచాల్సి వస్తోంది. దీంతో ఆదాయం లేకుండా పోయింది. ఆదాయం లేకున్నా కొన్ని రోజుల పాటు గడిచింది. రోజుల తరబడి ఇంట్లో ఖాళీగా కూర్చుంటే తినడానికి తిండి, డబ్బులు వచ్చేదెలా? అందుకే షాపులోని నగలన్నీ తీసేసి ఆలుగడ్డలు, ఉల్లిగడ్డలతో అలంకరించా..’ అని హుకుమ్‌చంద్ చెప్పుకొచ్చాడు.

చనిపోయిన నా తమ్ముడి కుటుంబాన్నీ పోషించాలి..

తనకు ఇప్పుడున్న ఆప్షన్ ఇదొక్కటేనని హుకుమ్‌చంద్ తెలిపారు. తన లాంటి చిరు వ్యాపారులెందరో ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఇప్పుడు ఎంతో కొంత సంపాదిస్తున్నా. దుకాణానికి కిరాయి చెల్లించాలి. నా తల్లిని, నా కుటుంబాన్ని పోషించాలి. చనిపోయిన నా తమ్ముడి కుటుంబాన్ని కూడా పోషించాలి’ అంటూ హుకుమ్‌చంద్ తన ఆవేదన వెల్లగక్కాడు.

ఆటో రిక్షా తీసుకొని రోజూ దగ్గర్లోని మార్కెట్‌కు వెళ్లి తాజా కూరగాయలను తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు హుకుమ్‌చంద్ తెలిపారు. ‘పనే దైవం.. బతకడానికి ఏ పనైనా చేయాలి’ అని చెబుతున్న హుకుమ్‌చంద్ సోనికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే!

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here