కిమ్ అజ్ఞ‌ాత‌ం వీడిన మర్నాడే.. ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య కాల్పులు

సరిహద్దులోని సైనికరహిత ప్రాంతంలో మరోసారి పెద్ద సంఖ్యలో కాల్పులకు పాల్పడుతోందని దక్షిణ కొరియా పేర్కొంది. దాదాపు మూడు వారాల అజ్ఞ‌ాత‌ం వీడి కిమ్ జోంగ్ ఉన్ బయటకు వచ్చిన మర్నాడే సరిహద్దుల్లో దక్షిణ కొరియా సైనిక పోస్టులపై కాల్పులకు దిగడం గమనార్హం. సరిహద్దుల్లోని తమ సైనిక స్థావరంపై ఉత్తర కొరియా వైపు నుంచి పలు రౌండ్లు కాల్పులు జరిపారని జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ కాల్పుల్లో తమ సైనికులు ఎవరూ గాయపడలేదని జేసీఎస్ పేర్కొంది. మా సైన్యం రెండు రౌండ్ల కాల్పులు జరిపి, తమ నిబంధనల ప్రకారం హెచ్చరికలు జారీచేసిందని వివరించింది. ఈ సంఘటనకు దారితీసిన కారణాలను గుర్తించడానికి హాట్‌లైన్ ద్వారా సైన్యం కమ్యూనికేట్ చేస్తున్నట్లు జేసీఎస్ తెలిపింది.

ఇదిలా ఉండగా.. 1953లో కొరియా యుద్ధం ముగిసినా.. సాంకేతికంగా ఉత్తర, దక్షిణ కొరియా మధ్య యుద్ధం కొనసాగుతూ వచ్చింది. ప్రపంచంలోనే అత్యంత ఉద్రిక్తతలు కలిగిన సరిహద్దుగా గుర్తింపు పొందింది. సైనికరహిత ప్రాంతం పేలుడు పదార్థాలు, ముళ్ల కంచెలతో నిండి ఉంటుంది. అయితే, 2018లో ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందంతో ఉద్రిక్తతలు కాస్త చల్లారాయి. సెప్టెంబరు 2018లో ప్యాంగ్‌యాంగ్‌లో జరిగిన శిఖరాగ్ర సమావేశంలో ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్, దక్షిణ కొరియా ప్రెసిడెంట్ మూన్ జే ఇన్‌లు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.

కానీ, అణునిరాయుధీకరణ ఒప్పందం అమలు విషయంలో మాత్రం ఉత్తర కొరియా ఉల్లంఘనలకు పాల్పడుతోంది. దక్షిణ కొరియాతో బలమైన సంబంధాలను కొనసాగించడానికి అయిష్టతను ప్రదర్శిస్తోంది. వాస్తవానికి రెండో ప్రపంచ యుద్ధం ముగిసే వరకు ఒకే దేశంగా కొనసాగిన కొరియా ద్వీపకల్పం అమెరికా, రష్యా ప్రయోజనాల నేపథ్యంలో 1945లో రెండుగా చీలిపోయింది. అప్పటి నుంచి 2018 వరకు ఉభయ కొరియాల మధ్య యుద్ధ వాతావరణం, ఉద్రిక్తతలు కొనసాగాయి. కొరియా యుద్ధం తర్వాత రెండు దేశాల మధ్య చర్చలు 2000లో ఒకసారి, 2007లో మరోసారి జరిగినా ఒప్పందాలేవీ అమలుకు నోచుకోలేదు. చివరిగా 2018లో చారిత్రక ఒప్పందం కుదురింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here