కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. మోస్ట్ వాంటెడ్ సహా ముగ్గురు ఉగ్రవాదులు హతం

జమ్మూ కశ్మీర్‌లో సైన్యం, ఉగ్రవాదుల మధ్య కాల్పుల పరంపర కొనసాగుతోంది. వరుసగా మూడో రోజు మరో ముగ్గురు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో జరిగిన వేర్వేరు ఎన్‌కౌంటర్‌లో హిజ్బుల్ ముజాయిద్దీ సంస్థ కీలక నేత రియాజ్ నయికూ, మరో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. అవంతిపొర దక్షిణ ప్రాంతమైన ఖేర్వే పంపోర్‌లోని షేర్షాలీ గ్రామంలో ఉగ్రవాదులు తలదాచుకున్నారనే నిఘా వర్గాల సమాచారంతో సైన్యం మంగళవారం తెల్లవారుజామున అక్కడకు చేరుకుంది. ఇండియన్ ఆర్మీ 50 రాష్ట్రీయ రైఫిల్స్, సీఆర్పీఎఫ్ 185 బెటాలియన్ సైన్యం సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టింది.

సైన్యం రాకను గమనించిన ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో అప్రమత్తమైన సైన్యం ఎదురుకాల్పులు జరపడంతో బుధవారం ఉదయం ఓ ఉగ్రవాది హతమయ్యాడు. కొన్ని గంటల తర్వాత మరో ఉగ్రవాదిని మట్టుబెట్టారు. ఘటనా స్థలిలో భారీగా పేలుడు పదార్థాలు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని, ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందని ఆర్మీ తెలిపింది.

అవంతిపొర సమీపంలోని బైఘ్‌పొర వద్ద జరిగిన మరో ఎన్‌కౌంటర్‌లో హిజ్బుల్ ముజాయిద్దీన్ కమాండర్, మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది రియాజ్ నయికూ హతమయ్యాడు. రియాజ్‌ను ప్రాణాలతో పట్టుకున్నా, మట్టుబెట్టినా రూ.12 లక్షలు రివార్డ్ ఇస్తామని గతంలో ప్రభుత్వం ప్రకటించింది. తాజా ఎన్‌కౌంటర్‌లో అతడ్ని సైన్యం మట్టుబెట్టడం విశేషం. బైఘ్‌పొరలో ఉగ్రవాది రియాద్ ఉన్నట్టు సమాచారం రావడంతో ఆపరేషన్ నిర్వహించామని పోలీసులు తెలిపారు. నయికూ స్వగ్రామమైన బైఘ్‌పొర‌లో మంగళవారం సాయంత్రం నుంచి పెద్ద ఎత్తున్న సెర్చింగ్ ఆపరేషన్ చేపట్టినట్టు వెల్లడించారు.

మరోవైపు, ముష్కరుల తూటాలకు వారం రోజుల్లో పది మంది సైనికులు బలయ్యారు. ఆదివారం జరిగిన జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు జవాన్లు వీరమరణం పొందారు. ఉగ్రవాదుల చెరలో బందీలుగా ఉన్న పౌరులను రక్షించి, ఈ వీరులు అమరులయ్యారు. సోమవారం కూడా పారామిలిటరీ దళాలపై కాల్పులకు తెగబడటంతో ముగ్గురు జవాన్లు అమరులయ్యారు. ఉగ్రవాదుల దాడిలో మరి కొంత మంది జవాన్లు గాయాల పాలైనట్లు తెలుస్తోంది. జమ్ము కశ్మీర్‌లోని కుప్వారా జిల్లా హంద్వారాలో సోమవారం జరిగిన కాల్పుల్లో ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here