కరోనా వేళ.. ఉగ్రవాదులకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన పాకిస్థాన్

పాకిస్థాన్‌లో కోవిడ్-19 కేసులు 18 వేలు దాటిన వేళ ఇమ్రాన్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. జైళ్లలో ఉంచిన ఉగ్రవాదులందర్నీ గృహనిర్బంధంలోకి తరలించింది. లష్కరే తొయిబా చీఫ్ హఫీజ్ మహ్మద్ సహా అనేక మంది ఉగ్రవాదులను వారి వారి ఇళ్లను తరలించింది. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) బ్లాక్ లిస్ట్ నుంచి తప్పించుకోవడం కోసం పాకిస్థాన్ ఇప్పటి వరకూ వారిని జైళ్లలో ఉంచింది. ఇప్పుడు కోవిడ్ సాకు చూపి సోషల్ డిస్టెన్సింగ్ పేరిట వారిని ఇళ్లకు పంపించేసింది.

లాహోర్ జైల్లో 50 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్ అని తేలిందని పంజాబ్ ప్రావిన్స్ సీఎం గత నెలలో ఓ ట్వీట్ చేశారు. ఇలాంటి పరిస్థితులను సాకుగా చూపి పాకిస్థాన్ ఉగ్రవాదులను దాదాపు స్వేచ్ఛగా వదిలేసింది. ఎఫ్ఏటీఎఫ్ ఇప్పటికే పాకిస్థాన్‌ను గ్రే లిస్టులో ఉంచింది. వచ్చే నెలలో దాన్ని మరోసారి సమీక్షించనుంది. ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్ వేలాది మంది పేర్లను ఉగ్రవాద జాబితా నుంచి తొలగించిందని వార్తలొచ్చాయి.

పాకిస్థాన్ ఉగ్రవాదులకు సాయం చేస్తోందనే కారణంతోనే ఎఫ్ఏటీఎఫ్ ఆ దేశాన్ని గ్రే లిస్టులో ఉంచింది. ఇప్పుడు ఉగ్రవాదులను విడిచిపెట్టడంతో తమను బ్లాక్ లిస్టులో పెట్టకుండా చూడటం కోసం కరోనాను తమకు అనుకూలంగా వాడుకుంటోంది.

ప్రపంచం మొత్తం కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవడం మీద దృష్టి సారించగా.. ఇదే అదనుగా పాక్ ఉగ్రవాదాన్ని ఎగదోస్తోంది. జమ్మూ కశ్మీర్లోకి ఉగ్రవాదులను పంపిస్తోంది. బారాముల్లాలో పాకిస్థాన్ కాల్పుల్లో గాయపడిన భారత సైనికుల్లో ఇద్దరు చికిత్స పొందుతూ శనివారం ప్రాణాలు కోల్పోయారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here