కరోనాకు హెర్బల్ మెడిసిన్.. స్వయంగా టెస్ట్ చేసిన మేనేజర్ మృతి

కరోనాకు మందు కనిపెట్టేందుకు ప్రపంచ దేశాలు విస్తృతంగా ప్రయోగాలు చేస్తున్నాయి. అమెరికా, ఇటలీ, చైనా, బ్రిటన్ తదితర దేశాలు ఇప్పటికే టెస్టింగ్స్ దశకు చేరుకున్నాయి. వ్యాక్సిన్‌ను మానవులపై ప్రయోగాత్మకంగా పరీక్షించారు కూడా. కరోనాకు మందు కనిపెడితే అది చాలా ప్రాణాలు నిలబెడుతుంది. అదే సమయంలో కాసుల వర్షం కురిపిస్తుందనడంతో ఎలాంటి సందేహం లేదు. అందుకే పలు చిన్నచిన్న కంపెనీలు కూడా గుట్టుచప్పుడు కాకుండా కరోనా మందు తయారీలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది.

తమిళనాడుకి చెందిన ఓ హెర్బల్ కంపెనీ కరోనాకి మందు కనిపెట్టేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. కంపెనీలో తయారు చేసిన మందు టెస్టింగ్ కోసం తాగి జీఎం మృతి చెందడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తమ కంపెనీలో తయారు చేసిన కరోనా మందును పరీక్షించేందుకు కంపెనీ యజమాని రాజ్‌కుమార్(67), జీఎం శివనేశన్ (47) స్వయంగా తాగేశారు. అనంతరం ఇద్దరూ అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు.

Also Read:

వెంటనే వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించగా శివనేశన్ చికిత్స పొందుతూ మరణించాడు. మందు పెద్దమొత్తంలో తీసుకోవడం వల్లే ఆయన చనిపోయినట్లు తెలుస్తోంది. కొన్నిచుక్కలు మాత్రమే వేసుకున్న యజమాని రాజ్‌కుమార్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చెన్నైలోని పెరుంగుడి ప్రాంతానికి చెందిన శివనేశన్ హెర్బల్ కంపెనీలో ఫార్మసిస్ట్, ప్రొడక్షన్ మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

కరోనా మందు కనిపెట్టానంటూ హల్‌చల్ చేసిన వ్యక్తిని పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. తాజా ఘటనతో ప్రజలను అప్రమత్తం చేసే పనిలో పడ్డారు. ఇప్పటి వరకూ కరోనాకు మందు కనిపెట్టలేదు. ప్రయోగాలు ల్యబొరేటరీ స్థాయిలోనే ఉన్నాయి. చేతులు శుభ్రంగా కడుక్కోవడం.. సామాజిక దూరం పాటించడం.. ముఖానికి మాస్కులు ధరించడం ద్వారా కరోనా రాకుండా నియంత్రించగలమంటూ అవగాహన కల్పిస్తున్నారు.

Read Also:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here