ఆ నగరంలో 334 మంది సూపర్ స్ప్రెడర్స్.. పరిస్థితి భయానకం

క రోనా వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తూ ఎలాంటి బీభత్సం చేస్తుందో మనం చూస్తునే ఉన్నాం. తెలంగాణలోని సూర్యాపేటలో ఒకే ఒక్క మహిళ కారణంగా సుమారు 40 మందికి వైరస్ వ్యాపించింది. మార్కెట్‌లో చేపలు విక్రయించే ఈ మహిళకు ఖాళీ సమయాల్లో పలువురి వద్దకు వెళ్లి పలుకరించడం, అష్టాచెమ్మా ఆడటం లాంటి అలవాట్లు ఉన్నాయి. ఇవి వైరస్ వ్యాప్తికి కారణమయ్యాయి. విజయవాడలో ఓ లారీ డ్రైవర్ కుటుంబం పేకాట, హౌసీ ఆట కారణంగా 80 మందికి పైగా కరోనా సోకింది. దక్షిణ కొరియాలో ఒకే ఒక్క మహిళ కారణంగా సుమారు 1200 మందికి వైరస్ వ్యాప్తి చెందింది. ఇలాంటి వాళ్లను సూపర్ స్ప్రెడర్ అంటారు. ఇప్పుడు ఇదంగా ఎందుకంటే.. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఇలాంటి సూపర్ స్ప్రెడర్లను 334 మందిని గుర్తించారు. వీరి ద్వారా ఇప్పుడు ఎంత మందికి వైరస్ వ్యాపించిందోనని అనేది హాట్ టాపిక్‌గా మారింది.

గుజరాత్‌లో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. అహ్మదాబాద్‌లో పరిస్థితి భయానకంగా ఉంది. గుజరాత్‌లో ఆదివారం (మే 10) ఒక్క రోజే 398 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8195కు చేరుకుంది. గుజరాత్‌లో కరోనా కారణంగా ఇప్పటివరకు 493 మంది మరణించారు.

అహ్మదాబాద్‌లో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. మొత్తం కేసుల్లో సుమారు 6 వేల కేసులు ఇక్కడే నమోదయ్యాయి. తాజాగా అధికారులు ఇక్కడ 334 మంది సూపర్ స్ప్రెడర్స్‌ను గుర్తించారు. దీంతో మే 15 వరకు అహ్మదాబాద్‌లో సరకులు, కూరగాయల దుకాణాలను మూసి వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ప్రజలు ఆరుబయటకు రావాలంటేనే వణికిపోయే పరిస్థితి నెలకొంది.

అహ్మదాబాద్‌లో 14 వేల మంది సూపర్‌ స్ప్రెడర్స్‌ ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. అధికారులు ఇప్పటికే వీరి వివరాలు సేకరించారు. సోమవారం నుంచి మూడు రోజుల పాటు వారందరికీ పరీక్షలు నిర్వహించనున్నారు. సరకుల కోసం వెళ్లే వాళ్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరించారు. చెబుతున్నారు. ముఖానికి మాస్క్‌ తప్పనిసరిగా ధరించాలని, కిరాణా షాపుల వద్ద శానిటైజర్ అందుబాటులో ఉంచాలని సూచించారు.

ఎన్ని జాగ్రత్తలు పాటించినా.. సరకులు, పాలు, కూరగాయలు తదితర నిత్యావసరాల కోసం బయటకు వెళ్లక తప్పదు. కిరాణా షాపు నిర్వాహకులు, కూరగాయలు అమ్మేవాళ్లు, పెట్రోల్‌ బంకుల్లో పనిచేసే వారు, ఇళ్ల నుంచి చెత్తను సేకరించే వారు, మందులషాపు నిర్వాహకులు తదితరులకు కరోనా సోకితే ఇక అంతే. అలాంటి వారితో వందలాది మందికి వైరస్ సోకే ప్రమాదం ఉంది. ఇలాంటి వారినే సూపర్‌ స్ప్రెడర్స్‌ అంటారు.

కూరగాయలు తదితరాలను ఇంటికి తీసుకురాగానే శుభ్రంగా కడగటం లాంటివి చేయాలని అధికారులు సూచిస్తున్నారు. ఆరుబయటకు వెళ్లొచ్చిన తర్వాత కాళ్లూ, చేతులూ శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలని చెబుతున్నారు. స్వీయ నియంత్రణ, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, భౌతిక దూరం తూ.చ. తప్పకుండా పాటించడం, మాస్క్‌లు ధరించడం ద్వారా కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here