ఆస్పత్రికెళ్తానన్న భార్య.. రాడ్డుతో కాళ్లు, చేతులు విరగ్గొట్టిన భర్త.. తిరుపతిలో దారుణం

కష్టకాలంలోనూ ఆస్పత్రుల్లో వైద్య సేవలందిస్తున్న సిబ్బందికి అభినందనలు వెల్లువెత్తుతుంటే ఓ భర్త మాత్రం దారుణానికి ఒడిగట్టాడు. ఉద్యోగం మానేయాలంటూ హుకుం జారీ చేశాడు. అందుకు నిరాకరించిందన్న కోపంతో ఉద్యోగానికి ఎలా వెళ్తావో చూస్తానంటూ ఇనుప రాడ్డుతో భార్య కాళ్లు, చేతులు విరగ్గొట్టిన అమానుష సంఘటన తిరుపతిలో చోటుచేసుకుంది.

తిరుపతిలోని ప్రసూతి ఆస్పత్రిలో వైద్యులకు సహాయకురాలిగా పనిచేస్తున్న త్రివేణికి దుర్గసముద్రానికి చెందిన డ్రైవర్ చరణ్‌తో ఆరేళ్ల కిందట వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలు సంతానం. తిరుపతిలోని అనంతవీధిలో నివాసం ఉంటున్నారు. పెళ్లైన ఏడాది తర్వాత త్రివేణి ప్రసూతి ఆస్పత్రిలో సపోర్టింగ్ స్టాఫ్‌గా చేరారు. ఐదేళ్లుగా ఉద్యోగం చేస్తున్నారు. కరోనా కష్టకాలంలోనూ ఆమె విధులకు హాజరవుతున్నారు.

Also Read:

అది నచ్చిన ఆమె భర్త ఉద్యోగం మానేయాలని హుకుం జారీ చేశాడు. అందుకు ఆమె నిరాకరించడంతో ఇద్దరుపిల్లలను తీసుకుని చరణ్ దుర్గసముద్రం వెళ్లాడు. పిల్లలను చూసేందుకు దుర్గసముద్రం వెళ్లిన భార్యను ఉద్యోగం మానేయాలని మరోమారు హెచ్చరించాడు. ఆమె ససేమిరా అనడంతో ఆగ్రహంతో ఊగిపోయిన భర్త.. ఉద్యోగానికి ఎలా వెళ్తావో చూస్తానంటూ ఇనుప రాడ్డుతో విచక్షణా రహితంగా దాడి చేశాడు.

ఆమె కాళ్లు, చేతులు విరగ్గొట్టాడు. ఈ దాడిలో ఆమె రెండు చేతులు, కాలికి తీవ్రగాయాలయ్యాయి. అనంతరం అక్కడి నుంచి భర్త పరారయ్యాడు. సోదరుడికి ఫోన్ చేసి విషయం చెప్పడంతో త్రివేణిని రుయా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Read Also:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here