ఆంధ్రా సరిహద్దుల్లో ‘కరోనా గోడ’లను కూల్చేసిన తమిళనాడు

మన రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో కలెక్టర్ సూచనలతో ఏపీ, సరిహద్దుల్లో గోడ కట్టిన సంగతి తెలిసిందే. కరోనా కట్టడి కోసమంటూ రాష్ట్రాల సరిహద్దుల్లో గోడలను కట్టించడం వివాదాస్పదమైంది. ఈ గోడల కారణంగా ఇరు రాష్ట్రాల మధ్య అంబులెన్స్‌లతోపాటు నిత్యవసరాలను తీసుకెళ్లే వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. రాష్ట్రాల సరిహద్దులో రోడ్లకు అడ్డంగా గోడలను నిర్మించడం వల్ల అంబులెన్స్‌లు నిలిచిపోయిన వీడియోలను చిత్తూరు జిల్లా ఎస్పీ వాట్సాప్ ద్వారా వెల్లూరు కలెక్టర్ షణ్ముగ సుందరానికి పంపించారు.

చిత్తూరు, వెల్లూరు జిల్లాల సరిహద్దుల మధ్య.. ఆదివారం పొన్నయ్‌లోని మథండకుప్పం, గుడియత్తాంలోని సైనగుంట చెక్ పోస్టుల వద్ద రోడ్ల మీద అడ్డంగా ఇటుకలతో గోడలు నిర్మించారు. పర్మిషన్ తీసుకొని పొన్నయ్ గుండా వెళ్తున్న వాహనదారులను క్రిస్టియన్ పేట, సెర్కాడు వైపు మళ్లించారు. సైనగుంట వైపు వెళ్తున్న వాహదారులను పరాదరమై వైపు మళ్లించారు.

నిత్యావసరాల రవాణాకు కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఏపీ నుంచి ఒత్తిడి రావడం, ఈ విషయం మీడియా ద్వారా తమిళనాడు సీఎం వరకు చేరడంతో.. తాత్కాలికంగా నిర్మించిన ఈ గోడలను కూల్చేశారు. గోడలను కూల్చే సమయంలో చిత్తూరు ఆర్డీవో రేణుక, తహసీల్దార్ సుబ్రమణియం కూడా అక్కడే ఉన్నారు.

వాస్తవానికి ఈ రెండు మార్గాల ద్వారా ఏపీ నుంచి తమిళనాడులోని కోయంబేడు మార్కెట్‌కు నిత్యం టమాటా, క్యాబేజీ, ఇతర కూరగాయలు రవాణా అవుతుంటాయి. కీలకమైన ఈ మార్గాలను మూసివేయడం ద్వారా నిత్యావసరాలను సరఫరా చేసే సరకుల వాహనాల రాకపోకలకు ఆటంకాలు ఏర్పడ్డాయని రెవెన్యూ అధికారులు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here